నారాయణపై చర్యలేవీ
- వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలల బంద్
- ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఒంగోలు అర్బన్: నారాయణ విద్యా సంస్థల్లో గత రెండు నెలల్లో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ విద్యా సంస్థలపై చర్యలెందుకు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మణికంఠారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఒంగోలులోని కార్పొరేట్ జూనియర్ కళాశాల బంద్ నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థి సంఘాలైన పీడీఎస్యు, విద్యార్థి జేఏసీలు మద్దతు ప్రకటించాయి. ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు. అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. మణికంఠారెడ్డి మాట్లాడుతూ పదిమందికి పైగా నారాయణ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఆ కళాశాల యాజమాన్యాలను కొమ్ముకాస్తూ చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.
దర్శి మాజీ ఎమ్మెల్యేకి చెందిన కశాశాల్లో విద్యార్థిని సెలవు తీసుకొని ఇంటికి వెళ్లి దాదాపు 20 రోజుల తర్వాత ఇంటివద్ద ఆత్మహత్య చేసుకుంటే అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కుట్రలకి నిదర్శనమన్నారు. చిత్తశుద్ధి ఉంటే నారాయణ యాజమాన్యంపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థుల మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. బంద్‌లో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్యామ్, ధనుంజయ, జేఏసీ నాయకులు నాగరాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు యశ్వంత్, కార్యదర్శి శ్యామ్యేల్ పాల్గొన్నారు.