అరుణగ్రహంపై ట్రంప్ దండయాత్ర!
అంగారకుడిని జయించాలని మనిషి ఎప్పటినుంచో భావిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నట్లున్నాయి. అందుకే అరుణగ్రహం మీదకు మనుషులను పంపే నాసా ప్రాజెక్టు కోసం ఆయన ఏకంగా 1.30 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. 2018 సంవత్సరానికి గాను నాసా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్ కింద ఈ నిధులు ఇచ్చారు. 2030 నాటికి అంగారకుడి మీదకు మనిషిని పంపాలన్నది నాసా ఉద్దేశం. దీనికి సంబంధించిన బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. నాసా చేపట్టిన వాటిలో అత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమానికి తగిన మొత్తంలో నిధులు ఇవ్వడం ద్వారా దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ట్రంప్ ఉద్దేశంలా కనిపిస్తోంది.
దాదాపు ఆరు దశాబ్దాలుగా నాసా చేస్తున్న కృషి వల్ల లక్షలాది మంది అమెరికన్లు సుదూర ప్రపంచం గురించి ఊహించుకుంటూ.. ఇక్కడే భూమ్మీద మెరుగైన భవిష్యత్తు వస్తుందని ఆశిస్తున్నారని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ బిల్లు మీద సంతకం చేయడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇలాంటి బిల్లు మీద సంతకాలు జరిగి చాలా కాలం అయ్యిందని అన్నారు. మానవుడు అంతరిక్షాన్ని జయించాలన్నది నాసా ప్రధాన ఉద్దేశమని, దానికి ఈ నిధులతో ఊతం వస్తుందని అన్నారు. ఇంత పెద్దమొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల నాసాలో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని కూడా తెలిపారు. వీరోచితమైన వ్యోమగాముల ఆరోగ్యం, వాళ్ల వైద్య చికిత్సలను పర్యవేక్షించడం కూడా ఈ కొత్త బిల్లులో భాగం అవుతుందని, దాంతో వాళ్ల సేవలు మరింత మెరుగ్గా అందుతాయని అన్నారు.