ఒకే చాంబర్లో ఇద్దరు ఆరోగ్యాధికారులు
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి (ఎంహెచ్ఓ) చేరికపై నెలకొన్న ప్రతిష్టంభన కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పిగా మారింది. చాంబర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్త ఎంహెచ్ఓ అందుబాటులో ఉంటుండగా... ఆమె వెళ్లాక సాయంత్రం సమయంలో పాత ఎంహెచ్ఓ విధులకు హాజరవుతుండడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇంతకు తమకు ‘ఎంహెచ్ఓ’ ఎవరో? తెలియక ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందోననే అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా డాక్టర్ సత్యనారాయణ సుమారు ఏడాదిగా పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.శైలజను నియమిస్తూ డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ ఎస్.అరుణకుమారి ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా జరిగిన ఈ ఎంపికలో డాక్టర్ శైలజను 11న విధులకు రిపోర్టు చేయాల్సిందిగా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఉత్తర్వులు పట్టుకుని కాకినాడ వచ్చిన ఆమెకు గడచిన ఐదు రోజులుగా ఇక్కడ చుక్కలుచూపిస్తున్నారు. ఆమెకు కమిషనర్ గోవిందస్వామి ప్రొసిడింగ్స్ ఇవ్వాల్సి ఉండగా, ఆయన పుష్కరాల విధులకు నర్సాపురం వెళ్లడంతో ఆమె నేరుగా కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ కలిశారు. వెంటనే విధుల్లో చేరాల్సిందిగా కలెక్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కమిషనర్ లేరన్న నెపంతో ఆమెకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా జాప్యం చే శారు.
కలెక్టర్ ఆదేశాలతో ఎంహెచ్ఓ డాక్టర్ శైలజ కార్పొరేషన్‌లోని తన చాంబర్‌కు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఎంహెచ్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సత్యనారాయణ ఆమె కార్యాలయం నుంచి వెళ్లాక సాయంత్రం సమయంలో ఆయన కూడా అదే చాంబర్లో విధులకు హాజరై రిజిష్టర్‌లో సంతకాలు చేస్తుండడం సిబ్బందిని గందరగోళంలోకి నెడుతోంది. ఉదయం పూట ఉన్న ఎంహెచ్ఓతో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది మాట్లాడితే వారిపై సదరు పాత అధికారి కక్ష కట్టి వేధిస్తున్నారంటూ సిబ్బంది వాపోతున్నారు. ఈ నెల 10న పాత ఎంహెచ్వో డాక్టర్ సత్యనారాయణ పుష్కర విధులకు వెళ్తూ రిలీవై ఇప్పుడు మళ్లీ చాంబర్‌కు వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరక్క మధ్యలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.