రాష్ట్రంలో హైస్పీడ్ రైలు!
- బెంగళూరు నుంచి మైసూరుకు
- చైనా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు
- నగర శివారు ప్రాంతాలను కలుపుతూ మినీ రైల్వే లైన్
- నవంబరులో ఒప్పందం ఖరారు
సాక్షి, బెంగళూరు : అనుకున్నవన్నీ జరిగితే త్వరలో రాష్ట్రంలో హైస్పీడ్ రైలు సంచరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. బెంగళూరు నుంచి మైసూరుకు హైస్పీడ్ రైలు నడిపేందుకు చైనాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. హైస్పీడ్ రైలుతో పాటు ఆరు లైన్ల రహదారి విస్తరణ, బెంగళూరులో రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు సంబంధించిన పలు పథకాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన పలువురు మంత్రులు, అధికారులు చైనాకు చెందిన శాంగ్‌డాంగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులతో బెంగళూరులో గురువారం సమావేశమై చర్చించారు.
మలుపులు లేకుండా ఉన్నప్పుడే హైస్పీడ్ రైలు ఏర్పాటు సాధ్యమవుతుందని, ఫలితంగా కెంగేరి, బిడిది మధ్య వంతెనను నిర్మించి హైస్పీడ్ రైలు సంచారానికి అనుకూలం చేయాలని సమావేశంలో ప్రాథమిక అవగాహనకు వచ్చారు. మైసూరు-బెంగళూరు మధ్య ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి అనుగుణంగా రూ.6వేల కోట్ల నిధులను సమకూర్చడానికి చైనా అంగీకరించింది. బెంగళూరులోని మెట్రో రైల్వే స్టేషన్ల మధ్య, మెట్రో రైల్వే స్టేషన్ల, బస్ స్టేషన్ల మధ్య కనెక్టివిటీను పెంచడానికి వీలుగా లైట్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంను ఏర్పాటు చేయాలనే చైనా కంపెనీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించింది. ఇందు కోసం నగర శివారు ప్రాంతాలను కలుపుతూ 40 కిలోమీటర్ల పరిధిలో మినీ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వీటితో పాటు హెబ్బాళ-చాళుక్యసర్కిల్-సెంట్రల్ సిల్క్ బోర్డు వరకూ 16 కిలోమీటర్ల పొడవుగల ఫ్లైఓవర్‌ను నిర్మించాలనే ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. దీని వల్ల 20 నిమిషాల్లో అటు వైపు నుంచి ఇటు వైపునకు ప్రయాణం పూర్తి చేయడానికి సాధ్యమవుతుంది. అదేవిధంగా గురుకుంట పాళ్య నుంచి కేఆర్ పురం వరకు (21 కిలోమీటర్లు-21 నిమిషాల ప్రయాణం), జ్ఞానభారతి నుంచి వైట్ ఫీల్డ్ వరకూ (27 కిలోమీటర్లు-40 నిమిషాల ప్రయాణం) మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
సమావేశం అనంతరం మంత్రి రోషన్‌బేగ్ మీడియాతో మాట్లాడుతూ... రానున్న నవంబర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు బెంగళూరులో జరుగుతోందన్నారు. ఆ సదస్సులో చైనా కంపెనీలతో వివిధ అృవద్ధి పథకాలకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదరనుందని అందుకు ముందుగా వివిధ విషయాలపై సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతను గురువారం సమీక్ష సమావేశం జరిగిందని వివరించారు.