MLA Alla Ramakrishna Reddy
-
‘అక్కడ జరిగింది.. నూటికి నూరు శాతం అక్రమాలే’
సాక్షి, అమరావతి/హైదరాబాద్: అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మేడ్చల్‌లో మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ విచారణలో బాధితులు అసలు నిజాలు వెల్లడించారని పేర్కొన్నారు. బాధితుల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారని తెలిపారు. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చింది. ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ.. భూములతో లబ్ధి పొందారని. అప్పటి ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తేవడమే కాకుండా మాట వినని వారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి.. టీడీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలపై తన పోరాటం ఆగదని.. ఎందాకైనా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కోర్టుకు అన్నీ వివరాలు అందజేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చదవండి: అక్రమాల పుట్ట ‘అమరావతి’ ‘అసైన్డ్’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు? -
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన
గుంటూరు: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు పట్టణంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్ఆర్సీపీ నేతలు, ఇతర అధికారులు హాజరయ్యారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజలకు తన మద్ధతు తెలిపేందుకు జెడ్పీ సమావేశం పూర్తయ్యేవరకు తాను నిలుచునే ఉంటానని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టంచేశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో కష్టపడుతున్నారని చెప్పిన ఆయన సమావేశం పూర్తయ్యేవరకూ నిలబడే ఉన్నారు. పార్టీ నేత ఆర్కేకు మద్ధతుగా సమావేశం ముగిసేవరకూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిలబడి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా తమ నిరసన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 50 రోజులు ఓపిక పడితే కష్టాలు తీరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు... కానీ, యాభై రోజులు గడిచినా ప్రజల కష్టాలు తీరడం లేదంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యతిరేకించారు. మరోవైపు రద్దయిన రూ.500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకునేందుకు తుది గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. -
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో దుర్దినం
దోచుకునేందుకే బిల్లుల సవరణ ప్రధాన ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించిన ఘనత చంద్రబాబుదే ధ్వజమెత్తిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి : ప్రధాన ప్రతిపక్షం లేకుండా రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే కీలక బిల్లులను ఆమోదించుకోవడం దేశచరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని, రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో సోమవారం ఒక దుర్దినమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ అతికీలకమైన ఇన్ఫ్ట్రాక్స్ర్ డెవ లప్మెంట్ 2001 బిల్లులో మార్పులు చేర్పులు చేయడం వెనుక ప్రభుత్వ భూములను తనకు ఇష్టం వచ్చిన వారికి (విదేశీసంస్థలకు) కట్టబెట్టి దోచుకునే కుట్ర దాగివుందని విమర్శించారు. ఇప్పటివరకు రాజధాని ముసుగులో రైతులు, కౌలు రైతులు, కూలీలు, చేతివృత్తిదారులను మోసగించిన చంద్రబాబు బిల్లులను సవరించుట ద్వారా తెలుగజాతి యావత్తును ఆయా విదేశీసంస్థలకు 99 సంవత్సారాలు పాటు బానిసలుగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఇలాంటి బిల్లుల సవరణ వల్ల అధికారంలోకి ఎవరు వచ్చినా 99 సంవత్సరాల పాటు భూములు తీసుకున్న వారికే సర్వహక్కులు, అధికారాలు దక్కుతాయని, అప్పుడు ఎవరూ ఏమి చేయలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లక్షల కోట్ల దోపిడీకి తెచ్చిన బిల్లును వైఎస్సార్ సీపీ కోర్టును ఆశ్రయించి అయినా అడ్డుకుంటుందన్నారు. విదేశీయులకు ఇక కప్పం కట్టాల్సిందే.. ఇక రాజధాని ప్రాంతంలో చిన్న ఇళ్ళు నిర్మించాలన్నా, నీరు తాగాలన్నా, కనీసం గాలి పీల్చాలన్నా విదేశీసంస్థలకు డెవలప్మెంట్ చార్జీలు, యూజర్ చార్జీల పేరుతో కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఇరుక్కుపోయిన అధికార పార్టీ నేతలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు పేరుతో మరో 8 వేల ఎకరాలను భూసేకరణ చేస్తామని మంత్రి నారాయణ చెప్పడం ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గుంటూరు, కృష్ణా జిల్లాలలో పంటలను లేకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలన్నింటిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.