రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో దుర్దినం
దోచుకునేందుకే బిల్లుల సవరణ
ప్రధాన ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించిన ఘనత చంద్రబాబుదే
ధ్వజమెత్తిన మంగళగిరి
ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)
మంగళగిరి : ప్రధాన ప్రతిపక్షం లేకుండా రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే కీలక బిల్లులను ఆమోదించుకోవడం దేశచరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని, రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో సోమవారం ఒక దుర్దినమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ అతికీలకమైన ఇన్‌ఫ్ట్రాక్స్‌ర్ డెవ లప్‌మెంట్ 2001 బిల్లులో మార్పులు చేర్పులు చేయడం వెనుక ప్రభుత్వ భూములను తనకు ఇష్టం వచ్చిన వారికి (విదేశీసంస్థలకు) కట్టబెట్టి దోచుకునే కుట్ర దాగివుందని విమర్శించారు. ఇప్పటివరకు రాజధాని ముసుగులో రైతులు, కౌలు రైతులు, కూలీలు, చేతివృత్తిదారులను మోసగించిన చంద్రబాబు బిల్లులను సవరించుట ద్వారా తెలుగజాతి యావత్తును ఆయా విదేశీసంస్థలకు 99 సంవత్సారాలు పాటు బానిసలుగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఇలాంటి బిల్లుల సవరణ వల్ల అధికారంలోకి ఎవరు వచ్చినా 99 సంవత్సరాల పాటు భూములు తీసుకున్న వారికే సర్వహక్కులు, అధికారాలు దక్కుతాయని, అప్పుడు ఎవరూ ఏమి చేయలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లక్షల కోట్ల దోపిడీకి తెచ్చిన బిల్లును వైఎస్సార్ సీపీ కోర్టును ఆశ్రయించి అయినా అడ్డుకుంటుందన్నారు.
విదేశీయులకు ఇక కప్పం కట్టాల్సిందే..
ఇక రాజధాని ప్రాంతంలో చిన్న ఇళ్ళు నిర్మించాలన్నా, నీరు తాగాలన్నా, కనీసం గాలి పీల్చాలన్నా విదేశీసంస్థలకు డెవలప్‌మెంట్ చార్జీలు, యూజర్ చార్జీల పేరుతో కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఇరుక్కుపోయిన అధికార పార్టీ నేతలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు పేరుతో మరో 8 వేల ఎకరాలను భూసేకరణ చేస్తామని మంత్రి నారాయణ చెప్పడం ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గుంటూరు, కృష్ణా జిల్లాలలో పంటలను లేకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలన్నింటిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.