mrps fires
-
‘ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తోంది’
అనంతపురం న్యూటౌన్ : ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు ... సీఎం కాగానే మాదిగలను విస్మరిస్తున్నారని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను చిత్తూరు జిల్లాలో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద మాదిగనై మాదిగలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మందకృష్ణ పర్యటనను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని, త్వరలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మధు మాదిగ, హనుమంతు, ఎంఈఎఫ్ నాయకులు నరసింహులు, అమరనాథ్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కాలవ దిష్టిబొమ్మ దహనం
పామిడి (గుంతకల్లు) : అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అంబేడ్కర్సర్కిల్లో శనివారం సాయంత్రం దళితసంఘాల ఆధ్వర్యంలో మంత్రి కాలవ శ్రీనివాసులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు టి.మల్లికార్జున, వెంకటేష్ మాట్లాడారు. మంత్రి కాలవ శ్రీనివాసులు బూటుకాళ్లతోనే ఐలాండ్‌పైకి వెళ్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పించడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్న ఆయన భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. మంత్రి తన తప్పిదాన్ని తెలుసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే కాలవకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నేతలు రామాంజనేయులు, మల్లి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.