ప్రజలను రక్షించేదెవరు ?
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ప్రజల రక్షణ కోసం ఏర్పడిన పోలీసు వ్యవస్థ అర్థం మారుతోంది. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు జాతీయ నేతల వ్రిగహాలకు, పార్టీ కార్యాలయాలకు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు కాపలా కాస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజల రక్షణ గాలికొదిలేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో నెల్లూరులోని రెండిళ్లల్లో పట్టపగలే దొంగలు పడి దొరికినకాడికి దోచుకెళ్లారు. గొలుసుదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోట్ల మహిళల మెడల్లోని గొలుసులను లాక్కెళ్లారు. పోలీసు రికార్డులకెక్కని సంఘటనలు కోకొల్లలు. వరుస ఘటనలు నగర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన పోలీసులు సమైక్య ఆందోళనలు, రాస్తారోకోల పర్యవేక్షణ, విగ్రహాలకు భద్రత తదితర కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఫలితంగా దొంగలు తమ హస్తలాఘాన్ని ప్రదర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది పోలీసులకు వివిధ ప్రాంతాల్లో డ్యూటీలు వేయడంతో పోలీసుస్టేషన్లు దాదాపు ఖాళీ అయ్యాయి. మొక్కుబడిగా నలుగురైదుగురు మాత్రమే స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించే వారిని పట్టించుకొనేవారు కరువయ్యారు. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టసాధ్యం.
ఉద్యమాల పేరుతో నిరసనలు, రాస్తారోకోలు, దీక్షలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కావడం లేదు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దీనికి తోడు నగరంలోని ప్రధాన రహదారి నిర్మాణంలో ఉండటం తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తమ రక్షణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.