అంధుల కోసం మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీ
మరో ఐదు నెలల్లో ప్రారంభం!
ఎవరి సాయమూ అవసరం లేదు
యునెస్కో సహకారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
{పతిరూపాలకు బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుళ్లు
వెల్లడించిన డెరైక్టర్ జనరల్
న్యూఢిల్లీ: అంధులు, చూపు మందగించిన వారి సౌలభ్యం కోసం జాతీయ మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఆ గ్యాలరీలోని కళారూపాలను వారు చేతితో తాకగానే వాటి చారిత్రక ప్రాముఖ్యతను తెలిపేవిధంగా ఆడియో గైడ్స్(మార్గదర్శకాలను) రూపొందించనున్నారు. దీంతో అంధులు ఇకనుంచి మరొకరి సాయం లేకుండానే వస్తువుల సమాచారం తెలుసుకోవచ్చు. అయితే రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ మ్యూజియంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవు. యునెస్కో సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న దీనిని ‘నేషనల్ మ్యూజియం యాక్సెస్ ప్రాజెక్టు ఫర్ పీపుల్ విత్ డిజెబిలిటీస్’ కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ ప్రత్యేక విభాగాన్ని మరో ఐదు నెలల్లో ప్రారంభించనున్నట్లు మ్యూజియం డెరైక్టర్ జనరల్ వేణు వాసుదేవన్ తెలిపారు.
చారిత్రక సమాచారాన్ని తెలియజేసేవిధంగా ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుల్‌ను ప్రతిరూపాలకు ఏర్పాటు చేస్తామని అసిస్టెంట్ క్యూరేటర్(విద్యా విభాగం) రీగె షిబా తెలిపారు. గ్యాలరీలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన కళారూపాల సమాచారాన్ని అందించాలని మ్యూజియంలోని వివిధ విభాగాలను కోరినట్లు చెప్పారు. అంతేకాకుండా అంధుల కోసం ప్రత్యేకంగా ఆడియో గైడ్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వస్తువులపై ఉన్నబ్రెయిలీ లిపిలోని సంఖ్యలను తాకగానే ఈ ఆడియో గైడ్స్ వాటి చారిత్రక సమాచారాన్ని వివరిస్తాయి.