10 కాలేజీలు అడిగితే.. వచ్చింది ఒక్కటే!
► మెదక్‌లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభానికి ఎన్సీటీఈ అనుమతి
► వసతులు లేనందున మిగతా డైట్లలో అనుమతికి నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సును పది జిల్లాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాల్లో క్రమంగా ఇంగ్లిషు మీడియం తరగతులను ప్రారంభిస్తున్న విద్యాశాఖ, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై ఉపాధ్యాయ శిక్షణ కోర్సు అయిన డీపీఎస్ఈని ప్రవేశ పెట్టాలని భావించినా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) అనుమతించలేదు. దీంతో ఈసారి డీపీఎస్ఈ ప్రారంభానికి అవకాశం లేకుండా పోయంది.
పాత పది జిల్లాల్లోని డైట్లలో 100 సీట్ల చొప్పున డీపీఎస్ఈ కోర్సుకు అనుమతించాలని విద్యాశాఖ ఎన్‌సీటీఈకి గతంలో ప్రతిపాదనలు పంపించింది. దానిపై ఎన్సీటీఈ బృందం గత నెలలో రాష్ట్రానికి వచ్చి ఆయా డైట్లను తనిఖీ చేసి వెళ్లింది. చివరకు పదింట్లో ఒక్క మెదక్ జిల్లా డైట్లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభించేందుకు అనుమతించింది. దీంతో కంగుతున్న విద్యాశాఖ ఎన్సీటీఈ అధికారులను సంప్రదించగా వసతుల లేమి, పక్కా భవనాలు లేని కారణంగా మిగతా 9 జిల్లాల్లోని డైట్లలో డీపీఎస్ఈ ప్రారంభానికి అనుమతించడం లేదని స్పష్టం చేసింది. వికారాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ డైట్లకు పక్కా భవనాలు లేవని, అవి రేకుల షెడ్డుల్లో కొనసాగుతున్నందున అక్కడ డీపీఎస్ఈ ప్రారంభానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
మిగతా ఆరు జిల్లాల్లో ఉన్న భవనాలు ప్రస్తుతం డీఎడ్ కోర్సు నిర్వహణకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయని, ఒక్కో కాలేజీలో 100 సీట్లు కలిగిన డీపీఎస్ఈ కోర్సు నిర్వహణకు సరిపోవని, మౌలిక సదుపాయాలు లేనందున ఆయా జిల్లాల్లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో విద్యాశాఖ పునరా లోచనలో పడింది. వెంటనే వరంగల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని డైట్లలో రేకుల షెడ్డులను తొలగించి, పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
మిగతా జిల్లాల్లోనూ అదనపు తరగతి గదులను నిర్మించి వచ్చే ఏడాదైనా అన్ని పాత జిల్లాల్లో డీపీఎస్ఈ కోర్సును ప్రారంభించేందుకు అనుమతి సాధించేదిశలో కసరత్తు ప్రారంభించింది. ఇక ఒక్క మెదక్ డైట్లో కోర్సుకు అనుమతించిన నేపథ్యంలో ఈసారి ఆ ఒక్క కాలేజీలో డీపీఎస్ఈ ప్రారంభించాలా? వచ్చే ఏడాదే అన్నింటిలో ఒకేసారి ప్రారంభించాలా? అన్నది తేల్చాలని ప్రభుత్వానికి విద్యాశాఖ లేఖ రాసింది. ప్రభుత్వం ఓకే అంటే ఈసారి ఒక్క మెదక్‌లోని డైట్లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభం అవుతుంది. లేదంటే ఇక వచ్చే ఏడాదే అన్నింట్లో ప్రారంభిస్తారని తెలుస్తోంది.