నా మాటలను ఎంజాయ్ చేశారు: బాలకృష్ణ
హైదరాబాద్ : ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన సినీ నటుడు బాలకృష్ణ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సినిమా ఆడియో పంక్షన్ లో తానన్న మాటలను అక్కడున్న వారంతా ఎంజాయ్ చేశారు. అందులో సగం మంది ఆడవాళ్లున్నారు. వాళ్లెవరూ తప్పుపట్టలేదు... అంటూ సమర్థించుకున్నారు. పైగా ఈ మాటలు అన్నది ఎక్కడో కాదు. అసెంబ్లీ సాక్షిగా... అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.
సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ బాలకృష్ణ మహిళలను కించ పరిచే విధంగా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అత్యంత దారుణంగా మాట్లాడటం జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
తానన్న మాటలపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బాలకృష్ణ తరఫున టీడీపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమా వేడుకల్లో తన చలన చిత్రాల్లో కథాపరమైన సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని కోరుతున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఆ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, మహిళలపై జరుగుతున్న దాడులు, అధికార పార్టీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు. ఈ సభలో ఉన్న ఒక సభ్యుడు మహిళల పట్ల ఎంత లోకువగా మాట్లాడారని, దానిపై జాతీయ చానళ్లలో చర్చ జరుగుతోందని, అలాంటి సభ్యులు కూడా ఈ సభలో ఉన్నారని విమర్శించారు.
ఈ చర్చ సందర్భంగా హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ జోక్యం చేసుకుని మాట్లాడారు. సినిమా ఆడియో ఫంక్షన్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే తాను ఆ మాటలన్నందుకు ఆ సభలో ఎవరూ తప్పపట్టలేదని చెప్పారు. మహిళలు అంటే తనకు గౌరవం ఉందని, మహిళలను జీవితంలో ఉద్దరించడం, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి జరుగుతున్నాయని, మహిళలకు ఏ సినిమాల్లో లేని ప్రాముఖ్యత నా సినిమాల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు.
సినిమాల్లో తన పాత్ర గురించి జనం ఏ కోరుకుంటున్నారు ఆడియో ఫంక్షన్ లో చెప్పాననీ, అక్కడ రెండు రకాలుగా మాట్లాడానని చెప్పారు. నా నుంచి అభిమానులు ఏమాశిస్తారు. నా గురించి ఏం కోరుకుంటారు... దాని గురించే మాట్లాడానన్నారు. ఇదే సందర్భంగా... సినిమా నేపథ్యం గురించి చెబుతూ... తాను అన్న మాటలకు అక్కడున్న అందరూ ఎంజాయ్ చేశారు. సభలో సగం వరకు మహిళలు ఉన్నారు. ఎవ్వరూ తప్పపట్టలేదు. (అసెంబ్లీని చేతులతో చూపిస్తూ) ఈ నాలుగు గోడల మధ్య కాదు.. అందరూ ఎంజాయ్ చేశారు... బయట ఎవ్వరి అభిప్రాయమైనా తీసుకోండి... దాన్ని వాళ్లు ఎలా తీసుకున్నారో... ఎలా అర్థమైందో.. అంటూ ముగించారు.
చట్ట సభలో మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాలకృష్ణ, తన మాటలపై ఏమాత్రం పశ్చాత్తపం వ్యక్తం చేయకుండా మహిళల పట్ల లోకువగా మాట్లాడిన మాటలను అందరూ ఎంజాయ్ చేశారంటూ అలవోకగా ప్రకటన చేయడం, ఈ నాలుగు గోడల మధ్య ఉండి కాకుండా బయట ఏమనుకుంటున్నారో అభిప్రాయం తీసుకోవాలని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చెప్పడం సర్వత్రా విస్మయపరిచింది.