తెలంగాణకు ‘టెస్కాబ్’
ఆప్కాబ్ విభజన.. నేటి నుంచి రెండు రాష్ట్రాలకు..
తెలంగాణ ఎండీగా నేతి మురళీధర్.. ఏపీకి నాగమల్లేశ్వర్రావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) విభజన పూర్తయింది. ఏపీకి ఆప్కాబ్‌గానే కొనసాగనుండగా.. తెలంగాణకు తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) కొత్తగా ఏర్పాటైంది. ఈ రెండు బ్యాంకులు గురువారం (ఏప్రిల్ 2వ తేదీ) నుంచి వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. టెస్కాబ్‌కు ఎండీగా నేతి మురళీధర్, ఆప్కాబ్‌కు నాగమల్లేశ్వర్రావు నియమితులయ్యారు. వారు గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. వారిద్దరూ ఇప్పటివరకు చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎం)గా వ్యవహరించారు.
ఇక ఆప్కాబ్ పాలక మండలి మాత్రం తాత్కాలికంగా కొనసాగనుంది. విభజన నేపథ్యంలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి పదవీకాలం బుధవారంతో ముగిసినట్లే. దీంతో ఈ నెల 25వ తేదీలోగా టెస్కాబ్ పాలకమండలి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఏపీలో ఆప్కాబ్‌కు ఈ నెలాఖరులోగా వారిని ఎన్నుకోవాలి. మరోవైపు ఆప్కాబ్ విభజన అసెంబ్లీలో జరగాలని.. జనరల్‌బాడీ, పాలకమండలిలే చేపట్టడం నిబంధనలకు విరుద్ధమంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లగా జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని చైర్మన్ వీరారెడ్డి చెప్పారు.
ఆస్తులు, ఉద్యోగుల విభజన..
1963లో ఆప్కాబ్ ఏర్పడింది. దీనికి ఉమ్మడి రాష్ట్రంలో 37 శాఖలు ఉండగా.. విభజనతో టెస్కాబ్‌కు 35, ఆప్కాబ్‌కు రెండు శాఖలు దక్కాయి. ఆ ప్రకారమే లావాదేవీలు ఉంటా యి. టెస్కాబ్‌కు హైదరాబాద్‌లోని అబిడ్స్ సమీపంలో ఉన్న ప్రస్తుత ప్రధాన కార్యాలయాన్నే కేటాయించగా.. ఆప్కాబ్‌కు తాత్కాలికంగా నారాయణగూడలో ఉన్న కార్యాల యాన్ని ఇచ్చారు. ఆప్కాబ్‌కు 231 మంది ఉద్యోగులను, టెస్కాబ్‌కు 318 ఉద్యోగులను కేటాయించారు. అడ్వాన్సులు, డిపాజిట్లు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానికే చెందుతాయి. రూ. 60 కోట్ల మేరకు ఉన్న ఉమ్మడిడిపాజిట్లను జనాభా నిష్పత్తి ప్రకారం రెండు బ్యాంకులకు పంచుతారు. తెలంగాణలో ఆప్కాబ్ బ్రాంచీలు 35 ఉండగా డీసీసీబీలు 9ఉన్నాయి. డీసీసీబీలకు 249 బ్రాంచీలు ఉన్నాయి. జిల్లాల్లో ప్రాథమిక సహకార సం ఘాలు (ప్యాక్స్) 789 ఉన్నాయి. 12.50 లక్షల మంది రైతులకు రూ. 4,500 కోట్ల మేరు రుణాలు ఇచ్చారు. కాగా టెస్కాబ్‌కు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్సీఏబీ.ఓఆర్జీ’ వెబ్‌సైట్‌ను గురువారం ఆవిష్కరించనున్నారు.
పాలకమండలికి ఎన్నికలు..
టెస్కాబ్ పాలకమండ లిలో 8 మంది సభ్యులున్నారు. అందులో ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులున్నారు. పాలకమండలికి ఈ నెల 25వ తేదీలోగా ఎన్నికలు జరపాలి. దీంతో ఎక్కువ సభ్యులున్న కాంగ్రెస్ పార్టీనే టెస్కాబ్ను కైవసం చేసుకునే అవకాశముంది.