విమానంలో అనుకోని అతిధి, బెంబేలెత్తిన ప్రయాణీకులు
న్యూజెర్సీ:అంతర్జాతీయ విమాన సర్వీసులో, అదీ బిజినెస్ క్లాస్‌లో అనుకోని అతిధి ప్రయాణీకులను బెంబేలెత్తించింది ఫ్లోరిడాలోని టంపా నగరం న్యూజెర్సీకి బయలు దేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 2038 విమానంలో పాము దర్శనిమిచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. అయితే సిబ్బంది దాన్ని పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. అందరూ సురక్షితంగా ఉన్నారనీ న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
వాషింగ్టన్ టైమ్స్ కథనం ప్రకారం బిజినెస్ క్లాస్‌లో విమానం ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులు పామును గుర్తించారు. దీంతో ప్రయాణీకులు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై వైల్డ్‌లైఫ్ ఆపరేషన్స్ సిబ్బంది, పోర్ట్ అథారిటీ పోలీస్ అధికారుల సహకారంతో "గార్టెర్ స్నేక్"ని పట్టుకుని తర్వాత దానిని అడవిలోకి విడిచిపెట్టారు. అయితే అది సాధారణ గార్టెర్ రకం పాము విషపూరితమైంది కాదనీ, తమ కేదైనా హానీ జరిగితే తప్ప కాటువేయమని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని ఉటంకిస్తూ ది వాషింగ్టన్ టైమ్స్ తెలిపింది. అంతకుముందు, ఫిబ్రవరిలో, మలేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. విమానం గాలిలో ఉండగానే విమానంలోపాము కనిపించిన ఘటన ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.