ఎయిరిండియా విమానం ఇంజన్లో మంటలు
అమెరికాలోని నెవార్క్లో ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా ఏఐ777 విమానం ల్యాండ్ అవుతుండగా మూడు టైర్లు పేలిపోయాయి. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నారు. వాస్తవానికి ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగి అది షట్డౌన్ కావడంతో విమానాన్ని అత్యవసరంగా దింపుతున్న సమయంలోనే ఈ టైర్లు కూడా పేలినట్లు తెలుస్తోంది. అయితే.. అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బందికి గానీ, ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు.
తొలుత ఏదో పక్షి ఢీకొనడం వల్లే ఇంజన్లో మంటలు చెలరేగి ఉంటాయని భావించారు గానీ.. తర్వాత మాత్రం అందుకు కారణం అది కాదని చెప్పారు. ముంబై నుంచి బయల్దేరి న్యూజెర్సీ వెళ్లాల్సిన ఈ విమానాన్ని బలవంతంగా నెవార్క్ విమానాశ్రయంలో దించాల్సి వచ్చింది. ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగిన విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించారు. దాంతో ఇంజన్ను షట్ డౌన్ చేసేశారు. విమానాన్ని జాగ్రత్తగా దించేందుకు పైలట్ ప్రయత్నించినా, మూడు టైర్లు ఒకేసారి పేలిపోవడంతో బలవంతంగా ఫోర్స్ లాండింగ్ చేయాల్సి వచ్చింది.