అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు.