తెలంగాణ అంటే మట్టి కాదు: కోదండరాం
భువనగిరి(నల్లగొండ): తెలంగాణ అంటే మట్టి, కొండలు, గుట్టలు, నదులు కాదని.. అన్ని వర్గాల ప్రజల బతుకులని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన చేనేత శంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వస్తే దాని ఫలితాలు అందరికి దక్కాలని భావించామని, రెండు లక్షల మంది చేనేత కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు.
ఐదు జిల్లాల్లో రెండు లక్షల మంది ఒక్క చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారు పడుతున్న అవస్థలపై సీరియస్గా అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను చూపాలన్నారు. తెలంగాణ గుర్తింపు, గౌరవం పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, గొల్లభావ చీరెలు, వరంగల్ కార్పెట్లు, మహదేవ్ టస్సార్ చీరలేనన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరూ చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు.