ఆ అధికారం మీకెక్కడిది..?
జీవో3పై టీ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు
పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశం
విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లన్నింటినీ తెలంగాణ రాష్ట్రం (టీఎస్) పేరుతో మార్చుకోవాలని వాహనదారులను ఆదేశిస్తూ జారీ చేసిన జీవో-3పై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీ సింది. ఏ చట్టం ప్రకారం ఆ జీవో ఇచ్చారో 24 గంటల్లో చెప్పాలని ఆదేశించింది. అలాంటి జీవో ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదో చెప్పాలని కోరింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రవాణాశాఖ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసిం ది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నంబర్ ప్లేట్ల మార్పిడి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం జూన్ 17న జారీ చేసిన జీవో ఎమ్మెస్ నెంబర్-3ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జె.రామ్మోహన్ చౌదరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జీవో-3 రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది డి.వి.రావు వాదనలు వినిపించారు. ఈ సమయం లో ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి డి.వి.రావు సమాధానాలిస్తుండగా, కోర్టు హాలులో ఉన్న పిటిషనర్ రామ్మోహన్ చౌదరి అబ్జక్షన్ (అభ్యంతరం) అంటూ చేతులు పెకైత్తి పెద్దగా అరిచారు. దీంతో కోర్టు హాలులో ఉన్న వారంతా బిత్తరపోయారు. ప్రధానన్యాయమూర్తి వెంటనే అతన్ని ముం దుకు పిలవగా, తానే ఈ కేసులో వాదనలు వినిపించుకుంటానని, న్యాయవాది అవసరం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం ఈ కేసు నుంచి డి.వి.రావును తప్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. తరువాత చౌదరి వాదనలు కొనసాగిస్తూ... రాష్ట్రాల విభజన జరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పాత వాహనాల నెంబర్లు యథాతథంగా కొనసాగాయని, కొత్త వాహనాలకు మాత్రమే కొత్త రాష్ట్రం తాలుకు నంబర్లు ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా జీవో 3 జారీ చేసిందన్నారు.
తెలంగాణలో కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాహనాలు తిరుగుతున్నాయని, వాటి నెంబర్ల ప్లేట్లపై లేని అభ్యంతరం ఏపీ వాహనాల విషయంలోనే లేవనెత్తడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర మోటారు వాహనాల చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో-3 ఉందని ఆయన వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం, దీనిపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది (రవాణాశాఖ) వివరణ కోరింది. ప్రాథమికంగానే ఈ జీవోను జారీ చేయడం జరిగిందని, దీనిని ఇప్పటి వరకు అమలు చేయలేదని జీపీ రాజేష్ నెహతా కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘మీకు (ప్రభుత్వానికి) అధికారం ఉంటే అప్పుడు జీవోలివ్వండి. అసలు అటువంటి జీవో ఇచ్చే అధికారం మీకెక్కడిదో ముందు చెప్పండి.? ఏ చట్టం ఇటువంటి జీవో ఇవ్వొచ్చని చెబుతుందో చూపండి.?’ అని ప్రశ్నించింది.