nunna mango market
-
‘నున్న’ మామిడి ర్యాంపు మీద..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్ వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ.. నున్న మార్కెట్ నుంచి మాత్రం మార్చి 20 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రస్తుతం నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని కల్లూరు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్‌కు మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. రోజుకు 300నుంచి 400 టన్నుల పండ్లు దేశంలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇప్పటివరకు నున్న మార్కెట్ నుంచి 2 వేల టన్నులకు పైగా కాయలు ఎగుమతి అయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుబడి తగ్గినా.. ధరలు ఆశాజనకం ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యంగా వచ్చింది. జనవరిలో కొంత పూత వచ్చినప్పటికీ వైరస్ బారిన పడటంతో పిందెకట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి రాగా.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట లభిస్తుందంటున్నారు. గత ఏడాది మార్చి నెలాఖరులో బంగినపల్లి టన్ను ధర రూ.30–35వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70–80 వేల వరకు ధర పలుకుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం టన్ను మామిడిపండ్ల ధర రూ.55 వేల వరకు పలుకుతోంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రసాలకు మంచి గిరాకీ ఉంది. కాయలు పక్వానికి రావడంతో తోటల్లోనే కాయ రూ.15– రూ.20 వరకు అమ్ముతున్నారు. పెద్ద రసాలు ఒక్కో కాయ రూ.25నుంచి రూ.30 పలుకుతోంది. సరుకు పూర్తి గా మార్కెట్లోకి వస్తే కొంత మేర ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు. మంచి ధర వస్తోంది ఈ ఏడాది మామిడి పండ్లు మంచి ధర పలుకుతున్నాయి. గతంలో ధరలు తగ్గిపోతాయేమోననే భయంతో రైతులు తొందరపడి పక్వానికి రాని కాయల్ని కోసేవారు. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిగుబడులు తగ్గడంతో సరుకు తక్కువగా ఉంది. అందువల్ల రైతులు కాయలు పక్వానికి వచ్చాకే కోస్తే బరువు పెరుగుతుంది. ధరలు కొంత అటూఇటూ ఉన్నా రైతులకు నష్టం ఉండదు. – శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ, ది మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్, నున్న -
బంగినపల్లి.. నున్న టు ఢిల్లీ!
నున్న (విజయవాడరూరల్): నున్న మ్యాంగో మార్కెట్లో మామిడికాయల సీజన్ ప్రారంభమైంది. బుధవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బంగినపల్లి మామిడికాయలను ప్యాక్ చేసి వాటిని లారీలో ఢిల్లీకి ఎగుమతి చేశారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రతాప్, ఈదర గ్రామం నుంచి జాన్‌వెస్లీ, కోడూరు గ్రామం నుంచి వెంకటేశ్వరావు, సాయనపాలెం గ్రామం నుంచి వెంకటేశ్వరావు అనే రైతులు తోటల నుంచి వచ్చిన మామిడి పంట దిగుబడులను, 12 టన్నుల కాయలను వేరు చేసి లోడు చేశారు. ఈ ఏడాది మామిడికాయల సీజన్ ప్రారంభంలో బంగినపల్లి మామిడి కాయలు టన్ను ధర రూ.70 వేలకు పలికింది. -
నున్న మ్యాంగో మార్కెట్లో ఇక బహిరంగ విక్రయాలు
‘ముసుగు’ వ్యాపారానికి స్వస్తి ♦ వారంలోగా మొదలు పెట్టేందుకు సర్కారు నిర్ణయం ♦ ఎలక్ట్రానిక్ డిస్ప్లే విధానం ద్వారా మార్కెట్ ధరల వెల్లడి ♦ పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్కెటింగ్ శాఖ ♦ కంగుతిన్న మామిడి వ్యాపారులు సాక్షి, విజయవాడ బ్యూరో /విజయవాడ రూరల్ : ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌గా గుర్తింపు పొందిన నున్న మ్యాంగో మార్కెట్లో మామిడి పళ్ల కొనుగోళ్లలో జరిగే ‘ముసుగు’ వ్యాపారానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై బహిరంగ వేలం పద్ధతిలోనే మామిడి పండ్ల కొనుగోళ్లు జరగాలని వ్యాపారులకు స్పష్టం చేసింది. వారంలోగా ఈ తరహా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపార వర్గాలు కంగుతినగా, మామిడి రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్‌కు ఏటా 20 వేల నుంచి 30 వేల టన్నుల మామిడి పండ్లు వస్తుంటాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మామిడి పండ్లు దిగుమతి అవుతుంటాయి. రైతులు తెచ్చిన పండ్లను ఇక్కడున్న వ్యాపారులు ముసుగు పద్ధతిలో కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పండ్ల కోసం ఇక్కడికొచ్చే బడాబడా సేఠ్లు ఇక్కడున్న కమీషన్ ఏజెంట్లతో రేటు కుదుర్చుకుంటారు. మార్కెట్లో ఉన్న సరకును చూసి కమీషన్ ఏజెంట్లు, సేఠ్ల చేతులపై రుమాల్ ముసుగు వేసుకుని కొనుగోలు చేసే సేఠ్ కమీషన్ వ్యాపారి చేతి వేళ్లను నొక్కుతారు. వాళ్లిద్దరి మధ్యా ముందే ఉన్న అవగాహన ప్రకారం టన్ను పండ్లకు సేఠ్ చెల్లించే ధర నిర్ణయమై పోతుంది. ఆపైన కమీషన్ వ్యాపారి రైతుకు తాను కొనే ధరను తెలియజేస్తాడు. తాను మార్కెట్‌కు తెచ్చిన పండ్లకు మార్కెట్లో ఎంత రేటు కుదిరిందో రైతుకు తెలిసే అవకాశం లేకుండా ముసుగు వ్యాపారం ఉంటుంది. కమీషన్ వ్యాపారి చెప్పే ధరే రైతుకు తెలుస్తుంది. దీనివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. కాయ బాగోలేదనీ, మంగు వచ్చిందన్న పేరుతో కమీషన్ వ్యాపారి రైతుకు తక్కువ ధర చెల్లించి అదే సరకును ఇతర రాష్ట్రాల వ్యాపారికి ఎక్కువకు విక్రయిస్తుంటారు. ఈ దోపిడీని అర్థం చేసుకున్న వేలాది మంది రైతులు రెండేళ్ల నుంచి మామిడి సరకును నున్న మ్యాంగో మార్కెట్‌కు తీసుకు రాకుండా బయట ఉన్న ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దీనివల్ల మార్కెట్‌కు సెస్సు రూపేణా వచ్చే ఆదాయం ఘోరంగా పడిపోయింది. దీన్ని గుర్తించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ముసుగు వ్యాపారం వల్ల వచ్చే అనర్థాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజుల కిందట మార్కెట్‌ను తనిఖీ చేసిన మంత్రి ఉమా బహిరంగ వేలం పద్ధతిలో పండ్ల కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. రైతులు కూడా ఈ విధానంపైనే ఆసక్తి చూపుతుండటంతో బుధవారం సాయంత్రం మార్కెట్ ఆవరణలో మామిడి ఉత్పత్తిదారుల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ ఇస్రార్ అహ్మద్, ఆర్జేడీ కాకుమాను శ్రీనివాసరావు హాజరై రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులతో బహిరంగ వేలం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ ఆర్జేడీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే పద్దతిలో ధరలు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రోజువారీ మామిడి ధరలు తెలియజేసేందుకు నున్న మ్యాంగో మార్కెట్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లే సిస్టంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జేసీ గంధం చంద్రుడు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి సరకుతో వచ్చే రైతులు నగదుతో సురక్షితంగా ఇళ్లకు చేరేలా మార్కెట్ ప్రాంగణంలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.