‘ముసుగు’ వ్యాపారానికి స్వస్తి
♦ వారంలోగా మొదలు పెట్టేందుకు సర్కారు నిర్ణయం
♦ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే విధానం ద్వారా మార్కెట్ ధరల వెల్లడి
♦ పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్కెటింగ్ శాఖ
♦ కంగుతిన్న మామిడి వ్యాపారులు
సాక్షి, విజయవాడ బ్యూరో /విజయవాడ రూరల్ : ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌గా గుర్తింపు పొందిన నున్న మ్యాంగో మార్కెట్‌లో మామిడి పళ్ల కొనుగోళ్లలో జరిగే ‘ముసుగు’ వ్యాపారానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై బహిరంగ వేలం పద్ధతిలోనే మామిడి పండ్ల కొనుగోళ్లు జరగాలని వ్యాపారులకు స్పష్టం చేసింది. వారంలోగా ఈ తరహా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపార వర్గాలు కంగుతినగా, మామిడి రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్‌కు ఏటా 20 వేల నుంచి 30 వేల టన్నుల మామిడి పండ్లు వస్తుంటాయి.
కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మామిడి పండ్లు దిగుమతి అవుతుంటాయి. రైతులు తెచ్చిన పండ్లను ఇక్కడున్న వ్యాపారులు ముసుగు పద్ధతిలో కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పండ్ల కోసం ఇక్కడికొచ్చే బడాబడా సేఠ్‌లు ఇక్కడున్న కమీషన్ ఏజెంట్లతో రేటు కుదుర్చుకుంటారు. మార్కెట్‌లో ఉన్న సరకును చూసి కమీషన్ ఏజెంట్లు, సేఠ్‌ల చేతులపై రుమాల్ ముసుగు వేసుకుని కొనుగోలు చేసే సేఠ్ కమీషన్ వ్యాపారి చేతి వేళ్లను నొక్కుతారు.
వాళ్లిద్దరి మధ్యా ముందే ఉన్న అవగాహన ప్రకారం టన్ను పండ్లకు సేఠ్ చెల్లించే ధర నిర్ణయమై పోతుంది. ఆపైన కమీషన్ వ్యాపారి రైతుకు తాను కొనే ధరను తెలియజేస్తాడు. తాను మార్కెట్‌కు తెచ్చిన పండ్లకు మార్కెట్‌లో ఎంత రేటు కుదిరిందో రైతుకు తెలిసే అవకాశం లేకుండా ముసుగు వ్యాపారం ఉంటుంది. కమీషన్ వ్యాపారి చెప్పే ధరే రైతుకు తెలుస్తుంది. దీనివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. కాయ బాగోలేదనీ, మంగు వచ్చిందన్న పేరుతో కమీషన్ వ్యాపారి రైతుకు తక్కువ ధర చెల్లించి అదే సరకును ఇతర రాష్ట్రాల వ్యాపారికి ఎక్కువకు విక్రయిస్తుంటారు.
ఈ దోపిడీని అర్థం చేసుకున్న వేలాది మంది రైతులు రెండేళ్ల నుంచి మామిడి సరకును నున్న మ్యాంగో మార్కెట్‌కు తీసుకు రాకుండా బయట ఉన్న ఓపెన్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. దీనివల్ల మార్కెట్‌కు సెస్సు రూపేణా వచ్చే ఆదాయం ఘోరంగా పడిపోయింది. దీన్ని గుర్తించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ముసుగు వ్యాపారం వల్ల వచ్చే అనర్థాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజుల కిందట మార్కెట్‌ను తనిఖీ చేసిన మంత్రి ఉమా బహిరంగ వేలం పద్ధతిలో పండ్ల కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు.
రైతులు కూడా ఈ విధానంపైనే ఆసక్తి చూపుతుండటంతో బుధవారం సాయంత్రం మార్కెట్ ఆవరణలో మామిడి ఉత్పత్తిదారుల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ ఇస్రార్ అహ్మద్, ఆర్‌జేడీ కాకుమాను శ్రీనివాసరావు హాజరై రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులతో బహిరంగ వేలం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ ఆర్‌జేడీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే పద్దతిలో ధరలు
మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రోజువారీ మామిడి ధరలు తెలియజేసేందుకు నున్న మ్యాంగో మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే సిస్టంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జేసీ గంధం చంద్రుడు మార్కెటింగ్ శాఖ ఆర్‌జేడీ శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి సరకుతో వచ్చే రైతులు నగదుతో సురక్షితంగా ఇళ్లకు చేరేలా మార్కెట్ ప్రాంగణంలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నున్న మ్యాంగో మార్కెట్‌లో ఇక బహిరంగ విక్రయాలు
Published Thu, Apr 9 2015 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement