సుమోటోగా ‘పాలెం’ కేసు
విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు
మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఘటన జరిగిన తీరు.. తదితర వాటిపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పాలెం ఘటనలో 45 మంది సజీవదహనమై సోమవారం నాటికి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. కనీసం బస్సు ఓనర్ను కూడా అరెస్టు చేయలేదు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేసినా.. స్పందించకుండా ఆపద్భందు పథకం కింద ఒక్కో బాధిత కుటుంబానికి కేవలం రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ కేసును మహబూబ్నగర్ జిల్లా కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని అందించే అంశాన్ని కూడా పర్యవేక్షిస్తామని వెల్లడించారు. నేర స్థల పంచనామాతో, ఘటనకు సంబంధించిన ఫొటోలు, మృతి చెందిన వారి, వారి కుటుంబసభ్యులతో కూడిన డాక్యుమెంట్లను జనవరి 13 లోపు కోర్టుకు సమర్పించాలని వనపర్తి డీఎస్పీకి మోటార్ యాక్సిడెంట్ క్లైం ట్రిబ్యూనల్ (ఎంఏసీటీ) చైర్మన్ హోదాలో జిల్లా జడ్జి టి. గంగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.