నేను దుర్గామాత భక్తురాలిని
చదివిన డాక్యుమెంట్లన్నీ సరైనవే
జేఎన్యూలో దుర్గామాతను అవమానించారు
మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారు
రాజ్యసభలో స్మృతి ఇరానీ
మంత్రి క్షమాపణలకు విపక్షాల పట్టు
న్యూఢిల్లీ
పార్లమెంటులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. యూనివర్సీటీల అంశంపై సభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ తరఫున ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నేతలు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే.. తాను దుర్గామాత భక్తురాలినని తాను చదివిన డాక్యుమెంట్లనీ సరైనవేనని స్మృతి స్పష్టం చేశారు. వాస్తవం ఏంటో వివరించాలన్నారు కాబట్టే తాను ఆ డాక్యుమెంట్లు చదివానన్నారు. అవి చదివేటప్పుడు చాలా బాధపడ్డానని కూడా ఆమె చెప్పారు. జేఎన్యూలో దుర్గామాతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కరపత్రాలు పంచారని అంటూ.. వాటిని చూపించారు. అక్కడ మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారని కూడా ఆమె అన్నారు.
దాంతో ప్రతిపక్ష నాయకులు ఒక్కసారిగా లేచి ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు సంబంధం లేని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తర్వాత స్మృతి సభలో నుంచి వెళ్లిపోయారు. ఆమె స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆనంద్ శర్మ, గులాంనబీ ఆజాద్ తదితరులు మండిపడ్డారు. అప్పుడు మరో మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకున్నారు. సభలో క్షమాపణలు చెప్పాలి తప్ప చట్టాలు చేయొద్దంటారా అని ఆయన ప్రశ్నించారు. ఈ గందరగోళం నడుమ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కలగజేసుకుని.. రికార్డులన్నింటినీ తాను పరిశీలిస్తానని, మతవిద్వేష పూరిత వ్యాఖ్యలు ఎవరు చేసినా.. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని, తాను చేయగలిగింది ఇది మాత్రమేనని అన్నారు. అనంతరం చర్చను ముగించి, ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు.