ప్రభుత్వాల ఇష్టానుసారం కాదు
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు
హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామక ఆర్డినెన్స్ విషయంలో ఉమ్మడి హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించింది. పార్లమెంటరీ కార్యదర్శులను నియమించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎక్కడుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకరికి మంత్రి హోదా కల్పించాలంటే అది రాజ్యాంగ ప్రకారమే జరగాలి తప్ప, ప్రభుత్వాల ఇష్టానుసారం కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్ హాజరవుతారని, విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. పార్లమెంటరీ కార్యదర్శుల ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, జలగం వెంకటరావు, వి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేయాలంటూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.