ట్రంప్ టీమ్‌లోకి ఇంద్రనూయి
న్యూయార్క్: అమెరికాలోని ఉద్యోగాల్లో అధికశాతం స్వదేశీయులకే దక్కేలా చేస్తాన్న వాగ్ధానంతో అధ్యక్షుడిగి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. ఆ హామీ అమలుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అమెరికాలో కంపెనీల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో అధ్యక్షుడికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకుగానూ విభిన్న రంగాలకు చెందిన టాప్‌మోస్ట్ కంపెనీల సీఈవోలతో ఒక ఉన్నతస్థాయి వేదికను ఏర్పాటుచేశారు. ‘వ్యూహాత్మక, విధాన వేదిక’(strategic and policy forum)గా పిలిచే ఈ వేదికలోకి భారత సంతతి మహిళ, ప్రస్తుత పెప్సీకో సీఈవో ఇంద్రనూయికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 19 మంది సభ్యులున్న ఈ వ్యూహాత్మక, విధాన వేదికలో ఇంద్రనూయి ఒక్కరే భారత సంతతికి చెందినవారు కావడం విశేషం.
‘అగ్రగామి సీఈవోగా కొనసాగుతోన్న ఇంద్రనూయిని ‘వ్యూహాత్మక, విధాన వేదిక’లోకి చేర్చుకుంటున్నందుకు గర్వపడుతున్నా. దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో ఆమె సేవలు అద్భుత ఫలితాలిస్తాయని ఆశిస్తున్నా’ అంటూ నూయీ నియామక ప్రకటనలో ట్రంప్ కితాబిచ్చారు. అనధికారిక, పక్షపాత రహిత విధానం (non-bureaucratic and non-partisan manner)లో పనిచేయనున్న ఈ వేదికకు స్టీఫెన్ ష్క్వార్జ్మన్(ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ సీఈవో) నేతృత్వం వహిస్తారు. ఇంద్రనూయి(పెప్సీకో సీఈవో) తోపాటు జాక్ వెల్చ్(జనరల్ ఎలక్ట్రిక్ మాజీ సీఈవో), ఎలాన్ మస్క్(స్పేస్ ఎక్స్ సీఈవో), ట్రావిస్ కలానిక్(ఉబెర్ సీఈవో), జేమి డిమోన్(చేజ్), మేరీ బరా(జనరల్ మోటర్స్) తదితరులు సభ్యులుగా ఉన్నారు.
1955, అక్టోబర్ 28న మద్రాస్(నాటి మద్రాస్ స్టేట్)లో జన్మించిన ఇంద్రనూయి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (కోల్‌కతా) నుంచేకాక బ్రిటన్‌లోని యేల్ యూనివర్సిటీ నుంచీ మాస్టర్ డిగ్రీ చేశారు. 1994లో పెప్సీకో సంస్థలో చేరిన నూయి.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2006లో పెప్సీకో ప్రెసిడెంట్ అండ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 63 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవర్, 1.10లక్షల మంది ఉద్యోగులున్న కంపెనీకి సారధిగా కొనసాగుతోన్న ఇంద్రనూయి ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగడించిన సంగతి తెలిసిందే.