ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి : డీవీఈఓ
ధర్మవరం టౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డీవీఈఓ చంద్రశేఖర్‌రావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. బోధన, సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాతల సహకారంతో అందిస్తున్న ‘మధ్యాహ్న భోజనం’ అమలు తీరును పరిశీలించారు. విద్యార్థినులకు ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతం పెంపునకు అన్ని చర్యలూ చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం 11 కళాశాలల్లో అదనపు తరగతి గదుల అవసరం ఉందన్నారు. ఇందుకు గానూ రూ.17 కోట్లు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.