అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుండు పిచ్చయ్య నాయుడు (64) ఈ నెల 11న సాయంత్రం రిమ్స్‌లో అనారోగ్యంతో చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తమకు శుక్రవారం ఉదయం వరకు తెలియదని, ఇప్పటికీ జైలు అధికారులు తమకు ఏమాత్రం సమాచారమివ్వలేదని, తమంతకు తాము తెలుసుకుని వచ్చామని రిమ్స్ మార్చురీ వద్ద బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని కృష్ణానగర్‌కు చెందిన సుండు పిచ్చయ్యనాయుడుకు ఓ హత్య కేసులో 2012లో జీవితఖైదు పడటంతో కడప కేంద్రకారాగారానికి తరలించారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. మూడు నెలల క్రితం పెరోల్‌పై బయటకు వచ్చి బంధువులతో గడిపి వెళ్లాడు. వారంరోజుల క్రితం ఆయన భార్య పిల్లలతో కలిసి కడప కేంద్ర కారాగారంలో ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆయన నాలుగు నెలల నుంచి ఛాతీలో నొప్పి, క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కేంద్ర కారాగారం ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా చేరి చికిత్సపొందుతున్నాడు. ఈనెల 11న మధ్యాహ్నం 3:30కు తీవ్ర ఛాతీనొప్పితో బాధపడుతూ ఉండగా వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ అదేరోజు సాయంత్రం 4:45కు మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మీనరసమ్మ, కుమారుడు లక్ష్మీనారాయణతోపాటు కుమార్తెలు వెంకటసుబ్బమ్మ, శ్రీదేవి, రమాదేవి ఉన్నారు. శుక్రవారం రిమ్స్ వద్దకు చేరుకున్న బంధువులు జైలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని తమ వెంట తీసుకువెళ్లారు.