Poorvanchal
-
230 స్పీడ్‌లో బీఎండబ్ల్యూ.. మేమంతా చావబోతున్నాం.. కాసేపటికే..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం పూర్తిగా ధ్వంసమై తుక్కును తలపించింది. ఇంజిన్, ఇతర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి తల, చేయి 20-30 దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటన సమయంలో బీఎండబ్ల్యూ గంటకు 230కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కారులో వెళ్తూ వీరంతా ఫేస్బుక్ లైవ్‌లో స్పీడ్‌మీటర్‌పై పోకస్ చేసి వీడియో తీశారు. ఆ సమయంలో ఓ యువకుడు 'మేమంతా కాసేపట్లో చావబోతున్నాం' అని అన్నాడు. కాసేపటికే కారు ప్రమాదానికి గురై నలుగురూ చనిపోయారు. అయితే మృతుల్లో ముగ్గురిని ఆనంద్ ప్రకాశ్(37), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37)గా గుర్తించారు పోలీసులు. కానీ మరో యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..! -
పూర్వాంచలే కీలకం
త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల దృష్టి పూర్వాంచల్ (ఢిల్లీ తూర్పు ప్రాంతం) ఓట్లపైనే పడింది. అక్కడ వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. దశాబ్దాల తరబడి ఈ వలసదారులు తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తమకు సంప్రదాయంగా మద్దతు ఇస్తున్న పంజాబీ, వైశ్య ఓటర్లపైనే ఆధారపడుతూ వీరిని నిర్లక్ష్యమే చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అత్యధికంగా పూర్వాంచల్ వర్గానికే టిక్కెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు పూర్వాంచల్‌కు చెందినవారే కావడం విశేషం. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి గోపాల్ రాయ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, దిలీప్ పాండే, సోమ్‌నాథ్ భారతి వంటి వారు ఆప్‌లో ఉంటూ చక్రం తిప్పుతున్న ప్రధాన నాయకులు. ఈ పరిణామంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూడా పూర్వాంచల్ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ వ్యూహమేంటి ? ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు మనోజ్ తివారీ చేతికి వచ్చాక పార్టీ వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. ఆయన ఎక్కువగా పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు చెందిన జనతా దళ్ (యునైటెడ్), రాం విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కమలనాథులు వలసదారులకు 10 టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో పూర్వాంచల్‌కు చెందిన ఎనిమిది మంది, ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతవాసులు ఉంటున్న అనధికార కాలనీలన్నింటినీ కేంద్రం రెగ్యులరైజ్ చేసింది. అంతేకాదు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉంటే జరిగే ప్రయోజనంపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కమలనాథుల బాటలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించుగా బీజేపీ బాటలోనే నడుస్తూ పూర్వాంచల్‌తో పాటు ముస్లిం, మైనార్టీ ఓట్లను కూడా దక్కించుకునేలా ప్రణాళికలు రచించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ వలసదారులతో పాటు ముస్లింలకు కూడా సీట్లు ఇచ్చింది. బిహార్ వలసదారుల ఓట్లను సంపాదించుకోవడానికి ఆర్జేడీ నాలుగు స్థానాలు కేటాయించింది. మాజీ క్రికెటర్, బిహార్‌కు చెందిన కీర్తి ఆజాద్ కాంగ్రెస్‌లో పూర్వాంచల్ ఫేస్‌గా మారారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తానే నిర్వహిస్తున్నారు. వలస ఓట్లను కాపాడుకునే ప్రయత్నాల్లో కేజ్రీవాల్ గత ఎన్నికల్లో వలసదారుల ఓట్లన్నీ గంపగుత్తగా పొందిన ఆప్ ఈసారి ఆ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వలసదారులు ఉండే కాలనీలకు సబ్సిడీ ధరలకే విద్యుత్ అందిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే నీళ్లు, కరెంట్ వంటివన్నీ తక్కువ ధరకే అందిస్తామన్న హామీతో గ్యారంటీ కార్డులు కూడా జారీ చేస్తోంది. ఈసారి కూడా అక్కడ 12 మందికి టిక్కెట్లు ఇచ్చింది. ఎన్నికల వేళ ఢిల్లీలో 300 ప్రాంతాల్లో అపాన్ పేరిట పూర్వాంచల్ ఫెస్టివల్ నిర్వహించింది. ఉత్తర బిహార్‌లో అత్యధికంగా మాట్లాడే మైథిలి భాషను ఢిల్లీ స్కూళ్లలో ఆప్షనల్‌గా ప్రవేశ పెట్టింది. పూర్వాంచల్ వాసుల చాత్ పండుగ కోసం యుమునా తీరం వెంట వెయ్యికి పైగా ఘాట్లను నిర్మించింది. -
పూర్వాంచల్‌లో పోటాపోటీ
► నేడే పోలింగ్ ► బీజేపీకి తలనొప్పిగా హిందూ యువవాహిని సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. నేపాల్, బిహార్‌లతో సరిహద్దును పంచుకుంటున్న పూర్వాంచల్ ప్రాంతంలోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు)లు ఎక్కువమంది ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యనేనని వారి అభిప్రాయం. ఇక్కడ 2012 ఎన్నికల్లో ఎస్పీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. బీఎస్పీ నుంచి ముక్తార్ అన్సారీ పోటీ పూర్వాంచల్‌లోని మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ జిల్లా సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు స్వతంత్రుడిగా గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని సీఎం అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్ గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఆజంగఢ్ జిల్లా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్‌పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువవాహిని అభ్యర్థులు.. హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్‌పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీని దెబ్బతీస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్‌ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్‌టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్‌ది బలియా జిల్లా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోవడంతో పరిస్థితి బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన స్థానాలే మెజారిటీ అందించాయి. స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు.. 2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్ లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్‌లోని అసమ్మతివర్గం పంపిణీచేస్తోంది.