రేపు స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభం
జలవనరుల శాఖ మంత్రి దేవినేని
పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు ఈనెల 30న ప్రారంభిస్తాని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం ఆయన ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టర్ కె.భాస్కర్‌తో కలిసి కాంక్రీట్ పనులు ప్రారంభించే ప్రదేశాన్ని, సీఎం సభావేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2018 నాటికి ప్రాజెక్ట్ పూర్తిచేసి పొలాలకు నీరందిస్తామన్నారు. వచ్చే సంక్రాంతి నుంచి డయా ఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంక్రీట్ పనులు ప్రారంభించిన అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు, ఈఈ కుమార్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఎస్సీఎంటీ రాజు, ట్రాన్స్ట్రాయ్ వైస్ ప్రెసిడెంట్ ఎ.తిరుమలేశు, ఆర్డీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు.
చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు ప్రారంభానికి సీఎం రానున్న నేపథ్యంలో కాంక్రీట్ వేసే ప్రాంతంలో, బహిరంగసభ ప్రాంతంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్పిల్‌వే ఫౌండేషన్ పక్కనే 70 ఎకరాల్లో సభావేదికను ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది రానున్నారనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు అధిక సంఖ్యలో విధులకు హాజరయ్యారు.