జోల్, నాయర్ సెంచరీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విజయ్ జోల్ (153 బంతుల్లో 110, 19 ఫోర్లు) జోరు అప్రతిహాతంగా కొనసాగుతోంది. అరంగేట్రం చేసిన తొలి దేశవాళీ మ్యాచ్‌లోనే అతను సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ అభిషేక్ నాయర్ (110 బంతుల్లో 102 నాటౌట్, 14 ఫోర్లు, సిక్స్) కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇక్కడి పోర్ట్ ట్రస్ట్ స్టేడియంలో శుక్రవారం 6/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ 93.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. ఇటీవలి కాలంలో ఇంటా బయటా విశేషంగా రాణిస్తున్న జోల్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ఘనమైన ఆరంభమిచ్చాడు.
ఇప్పటిదాకా ఆస్ట్రేలియా, శ్రీలంక పర్యటనలు కలుపుకొని అండర్-19, 23 స్థాయిలో పది మ్యాచ్‌లే ఆడిన జోల్ 4 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు సాధించడం విశేషం. మూడో రోజు ఆటలో జోల్... ఓపెనర్ జీవన్‌జోత్ సింగ్ (48)తో కలిసి మూడో వికెట్‌కు 77 పరుగులు, మన్‌ప్రీత్ జునేజా (43)తో నాలుగో వికెట్‌కు 97 పరుగులు, కెప్టెన్ నాయర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. కివీస్ బౌలర్లలో టాడ్ అస్టిల్ 3, ఇశ్ సోధి 2 వికెట్లు తీశారు. సుదీర్ఘ ఇన్నింగ్సే లక్ష్యంగా బరిలోకి దిగానని, తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం ఆనందంగా ఉందని విజయ్ జోల్ అన్నాడు. సోమవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది.