మళ్లీ తుస్‌స్‌స్..
మంత్రి వర్గ విస్తరణ వాయిదాతో కాంగ్రెస్‌లో అసంత ృప్తి సెగ
ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న ఆశావహులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఊరించి...ఊరించి..ఉసూరుమనిపించిన మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడడంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటోంది. విస్తరణను వాయిదా వేయాలన్న తన పంతాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నెగ్గించుకున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి వద్దంటూ అధిష్టానాన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు.
ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లతో ఆయన వరుసగా సమావేశమయ్యారు. మంత్రి వర్గంలో నాలుగే స్థానాలు ఖాళీ ఉండగా, 20 మంది పోటీ పడుతున్నందున ప్రస్తుతానికి మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేయడమే మంచిదని ఆయన సూచించినట్లు సమాచారం.
ముందుగా బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలను పూర్తి చేస్తే, మంత్రి పదవుల ఆశావహుల నుంచి ఒత్తిడి కాస్త తగ్గుతుందని ముఖ్యమంత్రి చెప్పడంతో, అధిష్టానం కూడా వాయిదాకే సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం దసరా తర్వాత విస్తరణ ఉంటుందని చెబుతున్నప్పటికీ, అప్పుడు కూడా అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత...అంటే వచ్చే ఏడాది మేలో మాత్రమే విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని ఆశావహులు వాపోతున్నారు.
పట్టు వదలని విక్రమార్కులు
మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని తెలిసినప్పటికీ ఢిల్లీలో మకాం వేసిన అనేక మంది ఆశావహులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులను కలుసుకుని చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉన్నందున, ఆయన తిరిగి వచ్చేంత వరకు విస్తరణ గురించి ఆలోచించేది లేదని సీఎం ఢిల్లీలోనే స్పష్టం చేసినప్పటికీ, ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు.