నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
చైతన్యపురి: నేరాల నియంత్రణ, నేర నిరూపణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ప్రభాత్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ. 11 లక్షలతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ యూనిట్‌ను చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాలరావుతో కలిసి మహేష్‌భగవత్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్బీనగర్ జోన్ పరిధిలోని అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, శాంతిభద్రత కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మహేష్‌భగవత్ కాలనీ మాజీ అధ్యక్షుడు గంగుల గోవర్దన్ రెడ్డి, అధ్యక్షుడు యాదగిరి ముదిరాజ్‌లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో మూడు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాహుల్, ట్రాఫిక్ ఏసీపీ రమేష్, చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర, ఎస్ఐలు కోటయ్య, సత్యనారాయణ, నర్సింహ, రత్నం, లింగం, లక్ష్మణ్, ప్రభాత్‌నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.