ప్రకాశం జెడ్పీ వైస్ చైర్మనే.. చైర్మన్
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జెడ్పీ వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రకాశం జెడ్పీ చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మనే నిర్వర్తిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యునిగా, జెడ్పీ చైర్మన్‌గా తనపై పడ్డ అనర్హత వేటు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈదర హరిబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను 3 నెలల్లో పరిష్కరించాలని కింది కోర్టును ధర్మాసనం ఆదేశించింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై దాఖలైన వివిధ పిటిషన్లను, అప్పీళ్లను వాదనలు విని ఇటీవల తన నిర్ణయాన్ని వాయిదా వేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీనే చైర్మన్‌గా విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తూ, ఈ అప్పీళ్లపై తుది విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.