భారీగా రేషన్ బియ్యం పట్టివేత
అక్రమార్కుల ‘భాగ్య’
బంగారుపేటలో ఆరు ప్రైవేట్ రైస్ మిల్లులపై దాడి
వేల బస్తాలు స్వాధీనం
కోలారు :బంగారుపేటలోని ఆరు ప్రైవేట్ రైస్ మిల్లులపై దాడి చేసిన రాష్ట్ర ఆహార శాఖ కమిషనర్ హర్షగుప్త, వేల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అన్నభాగ్య పథకం ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం బంగారుపేటలో అక్రమార్కుల పాలవుతోందని రాష్ట్ర ఆహార శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో హర్షగుప్త కలెక్టర్ డీకే రవితో కలిసి మిల్లులపై దాడికి బుధవారం ఉపక్రమించారు. కోలారు మెయిన్ రోడ్డులోని చిన్నమ్మాళ్, మోడ్రన్ రైసు మిల్లులపై దాడి చేశారు.
ఆ సమయంలో మిల్లు మెయిన్ గేటుకు తాళం వేసి యజమానులు, కార్మికులు పరారయ్యారు. తాళాలు పగులగొట్టి మిల్లులోకి వెళ్లిన కమిషనర్, కలెక్టర్ వేల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో నాలుగు మిల్లులపై కూడా దాడి చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. బంగారుపేటలో అనేక సంవత్సరాలుగా ఈ అక్రమాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని అన్నారు.
అవినీతికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారి గాయత్రిదేవిని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని మిల్లుల నుంచి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని, దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఆయా మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఉంచాలని ఆదేశించారు.