టికెట్ దక్కేదెవరికో..?
ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఖరారు ఆ పార్టీ అధిష్టానానికి తల నొప్పిగా తయారైంది. ఇక్కడ ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య టిక్కెట్ కోసం పోరు నడుస్తుండగా కొద్దికాలం క్రితం మధ్యలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన కుటుంబీకులను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని చూశారు.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా నాలుగో కృష్ణుడిలా పొరుగు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు తెర ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో టికెట్ అంశం మరింత పీఠముడిగా తయారైంది.
సాక్షి ప్రతినిధి కడప: ప్రతిష్టాత్మకమైన జమ్మలమడుగు వ్యవహారాన్ని ఛేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రొద్దుటూరు టికెట్ తేల్చడం కష్టంగా మారింది. పార్టీ సర్వేలు, నిఘా వ్యవస్థల నివేదికలకు అనుగుణంగా టికెట్ కేటాయిస్తే కేడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. నిఘా వర్గాల నివేదికలను పక్కన పెట్టి టికెట్ కేటాయిద్దామంటే, మిగిలిన వారికి ఆ స్థాయి వ్యక్తిగత వర్గీయులు లేరు. దాంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో ఓ మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు టికెట్ తనకు కేటాయిస్తే మాజీలు ఇరువురు సహకరిస్తారని, ఆమేరకు తాను సత్సంబంధాలు నెరపగలనని మంత్రి ఆదికి ఉప్పందించారు. అందుకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు ఉంటాయని అమాత్యులకు వివరించారు. అప్పటికే ఎటూ తేల్చలేక పలు రకాల ఆలోచనల్లో ఉన్న టీడీపీ అధిష్టానం చెం తకు ఈ వ్యవహారం చేరింది. దాంతో ఒక్కమారుగా ప్రొద్దుటూరు రాజకీయం వేడెక్కింది.
తెరపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వీరశివా..
ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిత్వంపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అక్కడి టీడీపీ వర్గాలు ఒక్కమారుగా అప్రమత్తమయ్యాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గాల వాసులకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే స్థాయి.. అర్హత లేదా...ఏందబ్బా..! కనగా కనపడుతోందా..!! చెడిపోయినోడికి చెండ్రాయుడి దేవళం అన్నట్లుగా వ్యవహారం ఉందంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు హల్చల్
చేశాయి.
కమలాపురం టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వీరశివారెడ్డికి టికెట్ కేటాయించా లని అనుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? అంటూ నిలదీస్తూ వాట్సాప్‌లో మెసేజ్ చక్కర్లు కొట్టింది. మరుసటి రోజు సోమవారం మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రొద్దుటూరు టికెట్ నాదేనంటూ ప్రకటించారు. సీఎం నుంచి తనకు ఆమేరకు హామీ ఉందని వివరించారు.
మంగళవారం మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తనకంటే పార్టీలో సీనియర్ లేరని, గెలిచే సీటు తనకు ఇవ్వకుండా వరదకు ఇచ్చి ఓడిపోయారని, ఈమారు టికెట్ తనదేనని తేల్చిచెప్పారు. తన వెనుకనున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలాన్ని సైతం వివరించారు. ఈ పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకుంటే సహకరించేదీ లేదని తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు ఇరువురికి ప్రొద్దుటూరు టికెట్ తనదంటే తనదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
వ్యక్తిగత ప్రయోజనాలే పీఠముడికి కారణం....
ప్రొద్దుటూరు టీడీపీలో మూడు వర్గాలు ఆరు గ్రూపులు అన్నట్లు పరిస్థితి ఉంది. అందుకు ప్రధాన కారకులు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, మంత్రి ఆదినారాయణరెడ్డిలేనని పలువురు వివరిస్తున్నారు. ప్రొద్దుటూరులో అడుగుపెట్టి పార్టీ నాయకత్వాన్ని తన కుటుంబానికి అప్పగించాలనే తలంపుతో ఎంపీ రమేష్‌నాయుడు వ్యవహరించి, వర్గాలను ప్రోత్సహించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఉన్న ఇరువురు మాజీ ఎమ్మెల్యేలకు దీటుగా తన సోదరుడు సీఎం సురేష్‌ను ఆ స్థానంలో చూడాలన్న ఉద్దేశం కూడా లేకపోలేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
పార్టీలోకి ప్రవేశించి అనూహ్యంగా మంత్రి పదవిని చేజిక్కించుకున్న ఆదినారాయణరెడ్డిలో కూడా పార్టీ ఉన్నతి కోసం పాటుపడాలనే చిత్తశుద్ధి కరువైందని ఆ కారణంగా మరో వర్గాన్ని పోషించారని టీడీపీ శ్రేణులు వివరిస్తున్నాయి. అలా ఎవరికి వారు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రొద్దుటూరు అభ్యర్థి వ్యవహారం పీఠముడికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం రేసులో ఉన్నారు.
శ్రీకృష్ణ రాయబారం నాటకంలో నాలుగో కృష్ణుడి పాత్రతో సరిపోలే విధంగా ఆయన పేరు తెరపైకి రావడం విశేషం. మాజీ ఎమ్మెల్యే వీరశివా వెనుక మంత్రి ఆది ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు సాక్షి ప్రతినిధికి వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక పార్టీ ప్రయోజనాల కంటే మంత్రి స్వప్రయోజనాలే అధికంగా ఉన్నాయని వివరించారు. కాగా ప్రొద్దుటూరు టికెట్ వ్యవహారం అమావాస్య తర్వాత తేలుస్తామని అధిష్టానం పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
రెండు పిల్లులు రొట్టె కోసం పోట్లాడుతుంటే కోతి రాయబేరం నెరిపి రొట్టె ముక్క కాజేసినట్లుగా టీడీపీ నాయకుడు వ్యవహరించాలనుకున్నాడు. ఆ కానీ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ విషయంలో. ముగ్గురుంటుండగానే తానైతే ‘ది బెస్ట్’ అంటూ మరో నాయకుడు తెరపైకి వచ్చారు. అందుకు తెరవెనుక మంత్రి ఆది సహకారం లభించింది. ఊహించని విపత్కర పరిస్థితిని పసిగట్టిన మాజీ ఎమ్మెల్యేలు టికెట్ నాదంటే... నాదే అంటూ ఏకరువు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. వెరసి పీఠముడి పడ్డ ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం కోసం నాలుగో కృష్ణుడు తెరపైకి వచ్చారు.