లాఠీ దెబ్బలతో యువకుడి మృతి
పేకాట ఆడుతున్నారని చావబాదిన లేపాక్షి ఎస్ఐ
అస్వస్థతతో మృతి చెందిన రమేష్
ఆగ్రహించిన మృతుని బంధువులు
లాకప్‌డెత్ చేశారంటూ ఆరోపణ
హిందూపురం అర్బన్ / హిందూపురం రూరల్/ లేపాక్షి : పేకాటరాయుళ్లపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. వారి దెబ్బలకు తాళలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పేకాట ఆడితే ప్రాణాలు తీసేస్తారా అంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. బాధితుల కథనం మేరకు.. లేపాక్షి మండలం పులమతి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వెనుక సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో వెళ్లి పాలిష్‌బండలు అమర్చే కార్మికుడైన రమేష్(25)తో సహా తొమ్మిదిమందిని లాఠీలతో చితకబాది పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అక్కడ మరోమారు లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలతో తీవ్ర అస్వస్థతకు గురైన రమేష్ (25)ను ఇద్దరు కానిస్టేబుళ్లు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటితే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రమేష్‌ను తీసుకొచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఎస్ఐ శ్రీధర్ కూడా తన సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. సీఐలు రాజగోపాల్‌నాయుడు, ఈదుర్‌బాషా, మధుభూçషణ్ ఆస్పత్రికి చేరుకుని విషయం బయకు పొక్కకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఏమైనా రాసుకోండి
జరిగిన సంఘటనపై రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడును వివరణ కోరగా... ఆయన స్పందించడానికి నిరాకరించారు. ‘మీ ఇష్టం ఏమైనా రాసుకోండి’ అంటూ వెళ్లిపోయారు.
‘ముమ్మాటికీ లాకప్డెత్తే’
పేకాట ఆడుతున్నారని పట్టుకెళ్లి లాకప్‌లో వేసి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం వల్లే రమేష్ చనిపోయాడని బంధువులు, పులమతి గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం రాత్రి హిందూపురం ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి ఇందిరమ్మ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు వచ్చి ఆందోళనకారులను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కొట్టి చంపింది కాక మళ్లీ సర్దిచెప్పేందుకు వస్తారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా మామను పొట్టనపెట్టుకున్నారు : మృతుడి భార్య పుష్ప
పేకాట ఆడితే ఏదో చేయరాని నేరం చేసినట్లు చితకబది కొట్టి చంపేస్తారా ? మా మామను పోలీసులు పొట్టన పెట్టుకున్నారంటూ రమేష్ భార్య పుష్ప కన్నీరు మున్నీరైంది. ఆమెను సముదాయించడం ఎవరి తరమూ కాలేదు. విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు.