పెనుమాక రీచ్‌కు ప్రత్యేక చట్టం?
* అధికార పార్టీ నేతలకు జేజేలు కొడుతున్న అధికారులు
* దటీజ్ మైనింగ్ శాఖ
పెనుమాక: జిల్లా మొత్తం 37 క్వారీలు ఉండగా మైనింగ్ అధికారులు 36 క్వారీలకు ఒక చట్టం, తాడేపల్లి మండలం పెనుమాక ఇసుక రీచ్‌కు మాత్రం మరో చట్టం అమలు చేసి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు తలుపులు బార్లా తెరిచారు. గత నెల 8వ తేదీ పుష్కరాలను పురస్కరించుకుని 37 ఇసుక రీచ్‌లను నిలిపి వేయాలంటూ మైనింగ్ శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం వాటికి మళ్లీ అనుమతులు ఇవ్వలేదు. కానీ పెనుమాక ఇసుక రీచ్‌లో మాత్రం యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహించి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అనుచరులు అందినకాడికి తమ జేబులు నింపుకొంటున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు 2012లో ప్రకాశం బ్యారేజి నుంచి ఎగువ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల వరకు ఇసుక మేటలు లేవని నిర్థారించారు. వారు ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుని, కృష్ణానదిలో తమ ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు నిర్వహిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో మూసివేసిన 36 ఇసుక రీచ్‌ల మీద నిఘా ఉంచిన అధికారులు సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఇసుక రీచ్‌పై సీతకన్ను వేశారు. ఎందుకని చర్యలు తీసుకోవడంలేదని ఓ మైనింగ్ అధికారిని ప్రశ్నించగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే కావడం, అతనికి ఏ పదవీ ఇవ్వకపోవడంతో తమ ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతోపాటు పెనుమాక ఇసుక రీచ్‌లో డ్రెడ్జింగ్ ద్వారా తీసే ఇసుక భవన నిర్మాణానికి ఉపయోగపడదని తెలిసీ, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఇసుకనే వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు.