KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్‌పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి..
జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే..
పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?!
ఆ చాన్స్‌తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి
హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో!
ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది..
షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది..
ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది..
ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ..
2000 సంవత్సరం మార్చి..
Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్‌లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్‌ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్‌కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్‌లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్‌కు టాప్ 20 ప్రోగ్రామ్స్‌లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు.
కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్‌గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్‌లో అసలు పాయింట్‌కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్‌గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ గా మారిపోయింది.
సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్‌ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్‌కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు.
ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్‌కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్‌కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్‌ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు.
ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్‌లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు.
ఆన్ ఎయిర్
250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్‌కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్‌లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్‌కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు.
2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్‌ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి.
కరోడ్‌పతి వర్సెస్ సినిమా
మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది.
ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్‌పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్‌పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్‌పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ.
కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్‌లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు.
హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్‌లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్‌కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్‌గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్‌తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది.
డింగు టకా.. గొళ్లెం పెట్టు
తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది.
‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్‌లో బ్రహ్మానందం హోస్ట్‌గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్‌పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది.
దగ్గుతో మోసం
అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా ఉన్న చాల్స్ ఇన్‌గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్‌గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది.
డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్‌ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్‌గ్రామ్‌ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం.
బైటికిరాని ఆ ఫుటేజ్‌లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు.
ఈ భాషల్లోనూ..
ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్‌గా భోజ్‌పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్‌గా ప్రసారమవుతోంది.
మూలం..
బ్రిటన్‌లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు.
-తోట భావనారాయణ