‘ప్రమాదం’ తప్పించాలని చూస్తే..
శంషాబాద్ రూరల్: ప్రమాదస్థలిలో సూచికలు ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ సమీపంలో శనివారం రాత్రి మహారాష్ట్రకు చెందిన ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న వంతెన ఢీకొని ఆగిపోయింది. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ ట్రాఫిక్ మొబైల్-2 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ప్రమాదానికి గురైన లారీ పక్కన రోడ్డుపై రేడియం కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ వైపు నుంచి శంషాబాద్ వస్తున్న ఓ లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అవంగపురం విజయ్‌కుమార్‌రెడ్డి(27) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మొబైల్ వ్యాన్ డ్రైవర్ డ్రైవర్ భిక్షపతి, రికవరీ వ్యాన్ డ్రైవర్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు విజయ్‌కుమార్‌రెడ్డి గండేడ్ మండలం సల్కర్‌పేట్ గ్రామస్తుడు. పోలీసులు ఆదివారం స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంగార్డు దుర్మరణంతో ఆర్జీఐఏ ట్రాఫిక్ ఠాణాలో విషాదం అలుముకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.