'బి.టెక్' పాసైన 'రఘువరన్'
చిత్రం: రఘువరన్ బి.టెక్.
తారాగణం: ధనుష్, అమలా పాల్, శరణ్య, సముద్రకణి
సంగీతం: అనిరుధ్,
మాటలు: కిశోర్ తిరుమల
పాటలు: రామజోగయ్యశాస్త్రి,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్
దర్శకత్వం: వేల్రాజ్
ఆ మధ్య నాలుగేళ్ళుగా అనువాద చిత్రాలు మన నేరు తెలుగు చిత్రాలకు గట్టి పోటీనిస్తూ వచ్చాయి. పెపైచ్చు, కమలహాసన్, రజనీకాంత్‌లతో పాటు చివరకు యువతరం హీరోలు సూర్య, కార్తి, విశాల్‌లు సైతం నేరు తెలుగు హీరోలకు తక్కువ కాదన్నంతగా క్రేజూ సంపాదించారు. కానీ, చిత్రంగా ఇటీవలే ముగిసిన 2014వ సంవత్సరంలో మాత్రం డబ్బింగ్ చిత్రాల ఆట సాగలేదు. విక్రమ్ 'పూజ' చిన్న సినిమా 'భద్రమ్' లాంటివి మాత్రమే బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేశాయి. అయితే, ఈ గడ్డుకాలంలో సైతం ఒక ధోరణి విడవకుండా సాగుతోంది. క్రేజున్న తమిళ హీరోల చిత్రాలతో పాటు, కాస్తంత తెలుగువారికి ముఖపరిచయమున్న హీరోలైతే చాలు అక్కడ బాగా ఆడినవి కాస్త అటూ ఇటూగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. అంతేతప్ప, రీమేక్ బాట పట్టడం లేదు. ముఖ్యంగా, తమిళంలో కాస్తంత రొటీన్‌కు భిన్నమైన కథలు తెరకెక్కినప్పుడు, రిస్కీ రీమేక్ కన్నా ఉన్నంతలో డబ్బింగే శ్రేయస్కరమని కూడా తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. సరిగ్గా ఆ బాటలో వచ్చినదే తాజా 'రఘువరన్ బి.టెక్' చిత్రం.
ఈ సరికొత్త 2015వ సంవత్సరానికి ప్రారంభ సినిమాగా విడుదలైందీ డబ్బింగ్ చిత్రం. తమిళంలో క్రేజున్న హీరో, రజనీకాంత్ అల్లుడూ అయిన ధనుష్ ఈ చిత్ర హీరో. గత ఏడాది తమిళంలో విడుదలై, ఘనవిజయం సాధించిన ‘వేలై ఇల్లా పట్టదారి’ (వి.ఐ.పి - అంటే పట్టభద్రుడైన నిరుద్యోగి అని అర్థం)కి తెలుగు అనువాదం - ఈ 'రఘువరన్ బి.టెక్'. తెలుగునాట ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా పేరున్న 'స్రవంతీ మూవీస్' అధినేత రవికిశోర్ స్వయంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందించడం విశేషం. నిజ జీవితానికి కొంతలో కొంతైనా దగ్గరగా ఉండే కథ, కథనంతో సినిమా చేయడానికి మన హీరోలు కమర్షియల్ చట్రం నుంచి బయటకు రావడానికి జంకే నేపథ్యంలో ఈ డబ్బింగ్ సినిమా మన ప్రేక్షకులకు అలాంటి మామూలు జీవిత కథల్లోని మంచి రుచి ఏమిటో చూపిస్తుంది.
కథ ఏమిటంటే...
ఓ మధ్య తరగతి కుటుంబం. అమ్మ (శరణ్య), నాన్న (తమిళ దర్శక - నటుడు సముద్రకణి), అన్న (ధనుష్), తమ్ముడు. సివిల్ ఇంజనీరింగ్ చదివినా, దానికి సంబంధించిన పనే చేస్తానంటూ అన్నయ్య రఘువరన్ ఉద్యోగం లేక తిరుగుతుంటే, తమ్ముడు కార్తీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంటాడు. నిరుద్యోగం వల్ల ఇంట్లో అమ్మా నాన్నలకు కూడా లోకువైన రఘువరన్, తమ పక్కింటి అమ్మాయి (అమలాపాల్)ను ప్రేమిస్తాడు. ఇంతలో ఒక అనుకోని సంఘటన అతని జీవితంలో మార్పు తెస్తుంది. అక్కడికి చిత్ర ప్రథమార్ధం ముగుస్తుంది. ఆ పరిస్థితుల్లో యాదృచ్ఛికంగా చేతికొచ్చిన ఉద్యోగం, మురికివాడ వాసులకు పక్కా ఇళ్ళ నిర్మాణం ప్రాజెక్ట్ హీరోకు జీవితమవుతాయి. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్‌కు అతను ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని అతను ఎలా పరిష్కరించాడు, సమాజంలోని తన లాంటి లక్షలాది నిరుద్యోగులకు అతను చూపిన బాట ఏమిటన్నది మిగతా సినిమా.
ఎలా నటించారంటే...
ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా నడిచే ఈ కథలో రఘువరన్ పాత్ర ధనుష్‌కు సరిగ్గా అతికినట్లు సరిపోయింది. అటు నిరుద్యోగిగా, ఇటు పక్కింటి అమ్మాయికి సైట్ కొట్టే కుర్రాడిగా, అమ్మ ప్రేమ కోసం తపించే అబ్బాయిగా, విలన్‌పై పోరుకు సిద్ధమైన నవతరం ప్రతినిధిగా - రకరకాల ఎమోషన్స్ నిండిన పాత్రను ధనుష్ చక్కగా పోషించారు. అలాగే, సర్వసాధారణమైన మధ్యతరగతి తల్లితండ్రులుగా శరణ్య, సముద్రకణి నటించారు అనడం కంటే, సమాజంలోని మధ్యతరగతి జీవితాన్ని కళ్ళ ముందు నిలబెట్టారని చెప్పాలి. కేవలం లుంగీ, బనియన్‌లోనే సినిమాలో అధికభాగం కనిపించే దర్శకుడు సముద్రకణి తనలో మంచి నటుడున్నాడని నిరూపించారు. కథానాయికగా అమలాపాల్ తన కళ్ళల్లోని మార్మికత నిండిన అమాయకత్వంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రసిద్ధ తమిళ కమెడియన్ వివేక్ లాంటి ఒకరిద్దరు కాసేపు నవ్వించే ప్రయత్నం చేస్తారు.
టెక్నీషియన్స్ ఎలా చేశారంటే...
తెలుగు హీరో రామ్‌తో తాజా సినిమా చేస్తున్న యువ దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రానికి అందించిన మాటలు బాగున్నాయి. అనిరుధ్ స్వరాల్లో పాటలు ఫరవాలేదు. హీరో హీరోయిన్ల మధ్య రొడ్డకొట్టుడు యుగళగీతాలు, గ్రూప్ డ్యాన్సులు కాకుండా, మాంటేజ్ పాటలతో మెప్పించడం విశేషం. కెమేరా పనితీరు బాగుంది. విలన్‌తో తలపడే సందర్భంలో ధనుష్ పాత్ర గుక్క తిప్పుకోకుండా చెప్పే సుదీర్ఘమైన డైలాగ్, అందుకు కుదిరిన డబ్బింగ్ తెరపై చూశాక సామాన్య ప్రేక్షకులు హాలులో ఈల వేయక మానడు. ఒక మామూలు కాలనీలో ఇల్లు, భవన నిర్మాణం జరిగే ప్రదేశం - ఇలా చాలా పరిమితమైన లొకేషన్స్‌లోనే కథను ఆసక్తికరంగా ముందుకు నడిపారు. దర్శకుడిగా మారిన కెమేరామన్ వేల్ రాజ్ ఫస్టాఫ్‌లోని వాస్తవికతనూ, సెకండాఫ్‌లోని ముందే ఊహించేయగల రొటీన్ కమర్షియల్ అంశాలనూ చక్కగా మిళితం చేశారని చెప్పాలి.
ఎలా ఉందంటే...
'రఘువరన్...' చూసి బయటకొస్తుంటే, చాలారోజుల తరువాత ఫరవాలేదనిపించే ఒక సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని వాస్తవానికి వీలైనంత దగ్గరగా చూపించడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశారు. ప్రథమార్ధంలో తెరపై చూపించే జీవితంలో చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు తమను తాము చూసుకుంటారు. అలాగే, హీరో, హీరోయిన్ల ప్రేమ కూడా అందంగా సాగిపోతుంది. ద్వితీయార్ధానికి వచ్చేసరికి మాత్రం సినిమా కొంత మూస బాటలోనే నడిచింది.
సామాన్యుడైన హీరో తన లాంటి పలువురు నిరుద్యోగ యువకులతో కలసి అపార ధనవంతుడైన ఒక గర్విష్ఠి విలన్‌పై ఎలా విజయం సాధించాడనే రజనీ మార్కు ఫార్ములాలో గడిచిపోతుంది. జరగబోయేదేమిటని ముందే అర్థమైపోతూ, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ సో సో అనిపించినా, సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ప్రేక్షకుడు కొంత తృప్తిగానే బయటకొస్తాడు. అమ్మ సెంటిమెంట్ ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద పారే మంత్రమని మరోసారి అర్థమవుతుంది. ఇటీవల ఆ మాత్రం తృప్తినిస్తున్న సినిమాలైనా రాకపోవడం ఒక రకంగా ఈ ‘రఘువరన్...’కు బాక్సాఫీస్ వద్ద పట్టిన అదృష్టం! ఒకసారి చూడడానికి ఫరవాలేదనిపించడం ఈ పండుగ సెలవుల సీజన్లో కలిసొచ్చే అంశం!!
- రెంటాల జయదేవ