నేను ‘హీరో మెటీరియల్’ అని ఇప్పటికీ అనుకోవడంలేదు! | Exclusive Interview with Dhanush | Sakshi
Sakshi News home page

నేను ‘హీరో మెటీరియల్’ అని ఇప్పటికీ అనుకోవడంలేదు!

Published Sat, Dec 27 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

నేను ‘హీరో మెటీరియల్’ అని ఇప్పటికీ అనుకోవడంలేదు!

నేను ‘హీరో మెటీరియల్’ అని ఇప్పటికీ అనుకోవడంలేదు!

 రజనీకాంత్ అల్లుడు ధనుష్ అని కాకుండా.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు ధనుష్. తమిళంలో మంచి మాస్ హీరో అనిపించుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ‘రాన్‌జనా’తో హిందీ రంగానికి పరిచయమై, ప్రస్తుతం అక్కడ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో ‘షమితాబ్’ చేస్తున్నారు. ‘3’ చిత్రం తర్వాత  ‘రఘువరన్ బీటెక్’ సినిమా ద్వారా మళ్లీ తెలుగు తెరపై ధనుష్ కనిపించనున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’     రవికిశోర్ జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుష్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 తమిళంలో మీరు నటించి, నిర్మించిన ‘వేలై ఇల్లా పట్టదారి’ తెలుగులో ‘రఘువరన్ బీటెక్’గా వస్తోంది. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటి?
 ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉండే కుర్రాడి కథ ఇది. ఇంజినీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు.. ప్రతి యువతీ యువకుడూ కనెక్ట్ అయ్యే కథ. మన కళ్లెదుట జరుగుతున్న కథలా ఉంటుంది. అందుకే చేశాను. ‘నీకేదైనా లక్ష్యం ఉంటే.. దాన్ని చేరుకోవడానికి త్రికరణ శుద్ధిగా పని చెయ్’ అని అంతర్లీనంగా చిన్నపాటి సందేశం ఉన్న కథ ఇది.
 
 ఛాయాగ్రాహకుడు వేల్‌రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం చేయడానికి కారణం?
 వేల్‌రాజ్ నాకు మంచి స్నేహితుడు. తమిళపరిశ్రమలో కెమెరామేన్‌గా ఆయనకు మంచి పేరుంది. కానీ, ఆయన దర్శకుడు అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. సడన్‌గా ఒకరోజు వచ్చి, ఈ కథ చెప్పి, దర్శకత్వం వహిస్తానంటే ఆశ్చర్యపోయాను. చేయగలుగుతాడా? లేదా అని సందేహపడ్డాను కూడా. కానీ, కథ నచ్చడంతో చేశాను. ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించింది కూడా!
 
 మీకు సొంత నిర్మాణ సంస్థ ఉండగా.. స్రవంతి మూవీస్‌కు అనువాద హక్కులు ఇవ్వడానికి  కారణం ఏంటి? పైగా ‘నాయకుడు’ తర్వాత ఈ సంస్థ విడుదల చేస్తున్న అనువాద చిత్రం ఇదేనేమో?
 స్రవంతి మూవీస్ మంచి సంస్థ అని విన్నాను. కానీ, ‘నాయ కుడు’ తర్వాత విడుదల చేస్తున్న అనువాద చిత్రం ఇదేనని తెలియదు. ఇంత విరామం తర్వాత ఈ సంస్థ నుంచి వస్తున్న తమిళ అనువాద చిత్రం నాదే కావడం ఆనందంగా ఉంది. వాస్తవానికి నాకు తెలుగు మార్కెట్ లెక్కలు తెలియదు. అందుకే, నా తమిళ చిత్రాలను తెలుగులో విడుదల చేయాలనే విషయం మీద పెద్దగా దృష్టి పెట్టను. స్రవంతి మూవీస్ వాళ్లు అడగ్గానే ఓకే అన్నాను.
 
 తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేసే ఆలోచన ఉందా?
 హిందీ ‘రాన్‌జనా’కి అవకాశం నాకు పెద్ద సవాల్‌లాంటిది. హిందీ భాష మాట్లాడలేను. కనీసం అర్థం కూడా కాదు. కానీ, చేశాను. అలాగే తెలుగులో బ్రహ్మాండమైన కథ కుదిరితే చేస్తాను.
 
 హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ‘షమితాబ్’ చేయడం గురించి?
 అమితాబ్‌గారు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయనతో సినిమా చేయడం మంచి అనుభూతినిస్తోంది.  ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ‘బెస్ట్ కోస్టార్’.
 
 ‘రఘువరన్ బీటెక్’ని రజనీకాంత్‌గారు చూశారా?
 ఆయనకీ కథ చాలా నచ్చింది. ఒకవేళ ఈ కథలో నేను హీరో కాకపోయినా ఆయనకు నచ్చి ఉండేది.
 
 రజనీకాంత్‌లాంటి స్టార్ ఉన్న ఇంట్లో నుంచి వేరే హీరో వస్తే.. ఆయన నీడను దాటుకుని ఇమేజ్ తెచ్చుకోవడం అంత సులువు కాదు.. మీరెలా సాధించారు?
 వాస్తవమే. అదంత సులువు కానే కాదు. సులువు కాకపోయినా సాధించావ్ అని నా దగ్గర వేరేవాళ్లు అన్నప్పుడు నాకు దక్కిన అతి గొప్ప అభినందనగా నేను భావిస్తాను. ఇదంతా నా ఘనత అని నేననుకోవడంలేదు. అంతా దేవుడి ఆశీర్వాదం.
 
 మీరు హీరో మెటీరియల్ అని ఎప్పుడు అనిపించింది?
 ఇప్పటికీ నాకు అనిపించడంలేదు. అసలు నేను హీరో మెటీరియల్ కాదు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటివరకు నా జీవితంలో నేను కలిసినవాళ్లందరూ మంచి వ్యక్తులే. అందుకే నా సినిమా ప్రయాణం ఇంతవరకూ వచ్చింది.
 
 ఇంత బక్కపలచని శరీరంతో అంత పెద్ద మాస్ హీరో అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా?
 కలలో కూడా అనుకోలేదు.
 
 కొంచెం బరువు పెరగాలని ఎప్పుడూ అనుకోలేదా.. మీ ఇంట్లో కూడా ఎవరూ చెప్పలేదా?
 బరువు పెరగాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకిలా హ్యాపీగా ఉంది. నేనెలా ఉంటే మా ఇంట్లోవాళ్లు అలా ఇష్టపడతారు.

 మా అబ్బాయిలు యాత్ర, లింగ నా సినిమాలు చూస్తారు. అయితే, నా గత రెండు చిత్రాల్లో నా పాత్ర చనిపోతుంది. అలాంటివి చూస్తే, పిల్లలిద్దరూ ఏడుస్తారని ఆ సినిమాలు చూపించలేదు. కానీ, ‘రఘువరన్ బీటెక్’ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో పాటు, సినిమా పాజిటివ్‌గా ముగుస్తుంది కాబట్టి, చూపించాం. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు.

- డి.జి. గోల్డీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement