బోధన్ డివిజన్లో రూ. 14 కోట్ల పంట నష్టం
బోధన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లిందని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ డివిజన్లో రూ. 14 కోట్ల 50 లక్షల పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. సమగ్రంగా పంట నష్టాన్ని గుర్తించేందుకు త్వరలోనే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సర్వే నిర్వహిస్తారన్నారు. ఏ రైతుకూ అన్యాయం జరుగకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించామన్నారు. వర్షాలకు 4,145 ఇళ్లు దెబ్బతిన్నాయని, డివిజన్లో 120 చోట్ల ఆర్అండ్బీ, పీఆర్ రోడ్లకు నష్టం జరిగిందని గుర్తించామన్నారు. రోడ్లకు మరమ్మతులకు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు.