Registration Homes
-
మళ్లీ పుంజుకున్న గృహాల రిజిస్ట్రేషన్లు, 5,181
సాక్షి, హైదరాబాద్: ఆషాడమాసం కారణంగా జులైలో పడిపోయిన గృహాల రిజిస్ట్రేషన్లు మళ్లీ పుంజుకున్నాయి. ఆగస్టులో రూ.2,657 కోట్లు విలువ చేసే 5,181 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతకుక్రితం నెలలో 4,313 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే 20 శాతం, రూ.2,101 విలువతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఏడాది క్రితంతో పోలిస్తే.. గతేడాది ఆగస్టులో గ్రేటర్లో 8,144 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్లలో 36 శాతం క్షీణత నమోదయింది. ఇదే సమయంలో ప్రాపర్టీ విలువల్లోనూ తగ్గుదల కనిపించింది. 2021 ఆగస్టులో రిజిస్ట్రేషన్ల ప్రాపర్టీ విలువ రూ.3,809 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి 30 శాతం క్షీణతతో రూ.2,657 కోట్లుగా ఉన్నాయి. 8 నెలలతో పోలిస్తే క్షీణతే.. గతేడాది తొలి 8 నెలల రిజిస్ట్రేషన్లు, ఆదాయం స్థాయికి గ్రేటర్ రియల్టీ ఇంకా చేరుకోలేదు. గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు గ్రేటర్లో రూ.25,007 కోట్ల విలువ చేసే 56,035 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అదే ఈ ఏడాది తొలి 8 నెలల్లో చూస్తే రూ.22,680 కోట్ల విలువ చేసే 46,078 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ. 50 లక్షల లోపు గృహాలకే డిమాండ్.. ఇప్పటికీ నగరంలో రూ.50 లక్షల లోపు ధర ఉన్న గృహాలకే డిమాండ్ ఉంది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 55 శాతం గృహాలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు లోపు ధర ఉన్నవే. గతేడాది ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో ఈ ఇళ్ల వాటా 37 శాతంగా ఉంది. 2021 ఆగస్టులో రూ.25 లక్షల లోపు ధర ఉన్న గృహాల వాటా 35%గా ఉండగా.. గత నెలలో వీటి వాటా ఏకంగా 16 శాతానికి పడిపోయింది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా గతేడాది ఆగస్టులో 28 శాతం నుంచి ఈ ఆగస్టు నాటికి 29 శాతానికి పెరిగింది. 72% గృహాలు 2 వేల చ.అ. లోపువే.. 1,000 నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న గృహాలనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో ఈ విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా ఏకంగా 72 శాతంగా ఉంది. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్న అపార్ట్మెంట్ల వాటా గతేడాది ఆగస్టులో 9 శాతం ఉండగా.. ఈ ఆగస్టు నాటికి 7 శాతానికి క్షీణించింది. -
నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్
సీడీఎంఏ అసెస్మెంట్ నంబరు ఆధారంగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు వెబ్సైట్లో వివరాల నమోదు అమల్లోకి స్టాంప్ ట్రాకింగ్ జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో చోటుచేసుకుంటున్న నకిలీలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. నిబంధనలను కఠినతరం చేసి నకిలీలకు చెక్ పెట్టేలా కార్యాచరణ రూపొందించారు. దీన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. చిత్తూరు (కార్పొరేషన్): మున్సిపాలిటీల పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్లకు అధికారులు చెక్ పెట్టనున్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లను వాటి అసెస్మెంట్ నంబరు (మున్సిపాలిటీ శాఖ వారు ఇచ్చే నివాస ప్రాపర్టీ ట్యాక్స్ నంబరు) ఆధారంగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా చేస్తుండడంతో అక్రమాలకు చెక్ పడింది. అదే తరహాలో మున్సిపాలిటీ శాఖ సీడీఎంఏ (కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) డేటాలో ఉండే అసెస్మెంట్ నంబరు ఆధారంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. జిల్లాలో తిరుపతి, పుత్తూరు మున్సిపాలిటీల్లోనే ప్రస్తుతం సీడీఎంఏ డేటా సక్రమంగా ఉంది. గతంలో ఇలా.. గతంలో మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మూడు రకాలుగా చేసేవారు. 1.ఆర్సీసీ శ్లాబ్ ఇల్లు, 2.మిద్ది మేడలు, 3.పెంకుటిల్లుగా విభజించేవారు. వాటి డోర్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసేవారు. ఈ విధానం వల్ల అధికారుల వద్ద ఉన్న సమాచారానికి, క్షేత్రస్థాయిలోని సమాచారానికి తేడాలు ఉండేవి. రెండు అంతస్తులు ఉన్న వారు కూడా ఒక అంతస్తుగా చూపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉండేది. ఒకే నంబరు మీద రెండు, మూడు గృహాలను రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. తద్వారా కొనుగోలుదారులు, విక్రయదారులు, భాగస్వాముల మధ్య గొడవలు జరిగేవి. కోర్టుల వరకు వెళ్లేవారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా అక్రమ రిజిస్ట్రేషన్‌పై 75 కేసులు నమోదయ్యాయి. ప్రసుత్తం ఇలా.. అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టడానికి మున్సిపాలిటీ అధికారులు నివాసాల వివరాలను సీడీఎంఏ వె బ్‌సైట్‌లో నిక్షిప్తం చేయనున్నారు. అందులో గృహానికి సంబంధించిన అన్ని వివరాలతో పాటు మున్సిపాలిటీ శాఖ వారు ఇచ్చే నివాస ప్రాపర్టీ ట్యాక్స్ నంబరును వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా నకిలీలకు అవకాశం లేకుండా పోతుందని అధికారులు చెబుతున్నారు. నిజమైన యజమాని హక్కులకు భంగం కలగదు. సీడీఎంఏ ద్వారా తిరుపతి, పుత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఐదు నెలల్లో రెండు వేల రిజిస్ట్రేషన్లను అధికారులు విజయవంతంగా చేపట్టారు. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షులు తమ ఆధార్ కార్డుల వివరాలను సమర్పించాల్సి ఉంది. స్టాంప్ ట్రాకింగ్ స్టాంప్ ట్రాకింగ్ అమల్లోకి తీసుకురానున్నారు. నాసిక్‌లో ప్రింట్ అయిన తర్వాత స్టాంపులు ఏ విధంగా ఆయా కార్యాలయాలకు చేరింది. ప్రసుత్తం అది ఎక్కడ ఉంది. ఆన్లైన్లో పరిశీలన చేయొచ్చు. ఈ-చలానా చెల్లింపులు సైతం అమల్లోకి రానున్నాయి. సీడీఎంఏ వెబ్‌లో వివరాలు నమోదు చేస్తున్నాం తిరుపతి, పుత్తూరు మినహా మిగిలిన మున్సిపాలిటీలలో సీడీఎంఏ వెబ్సైటులో వివరాలు సక్రమంగా నమోదు కాలేదు. అందుకే అక్కడ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్కడ కూడా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. స్టాంప్ ట్రాకింగ్, ఈ-చలానా విధానాల వల్ల కూడా లోపాలను సరిదిద్దవచ్చు. - రమేష్, డెరైక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ