Reliance Nippon Life Insurance
-
పాలసీదారులకు రిలయన్స్ నిప్పన్ లైఫ్ బోనస్
ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2022–23) రూ.344 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. పార్టిసిపేటరీ పాలసీదారులకే ఈ బోనస్ లభించనుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ.108 కోట్ల నికర ఆదాయాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 65 శాతం అధికమని తెలిపింది. (ఇదీ చదవండి: భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్ - కొత్త ఉత్పత్తుల విడుదలకు సన్నాహాలు!) ఈ బోనస్ 5.69 లక్షల పార్టిసిపేటరీ పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ సీఈవో ఆశిష్ వోహ్రా పేర్కొన్నారు. గత 22 ఏళ్లుగా సంస్థ పాలసీదారులకు బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ నిర్వహణలో మొత్తం రూ.30,609 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2023 మార్చి నాటికి సంస్థ మొత్తం రూ.85,950 కోట్ల బీమా రక్షణకు హామీదారుగా ఉంది. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్‌లో వాటాలపై ఆదిత్య బిర్లా గ్రూప్ ఆసక్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్ఎన్ఎల్ఐసీ)లో వాటాల కొనుగోలు కోసం తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా బరిలోకి దిగింది. రిలయన్స్ క్యాపిటల్‌కు (ఆర్సీఎల్) ఉన్న 51 శాతం వాటా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎన్ఎల్ఐసీలో రిలయన్స్ క్యాపిటల్‌కు 51 శాతం, జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి దీన్ని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. భారీగా పేరుకుపోయిన రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతుండటంతో ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రద్దు చేసింది. దివాలా చట్టం కింద చర్యలకు సంబంధించి వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్సీఎల్ విక్రయం కోసం అడ్మినిస్ట్రేటర్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించారు. మొత్తం 14 బిడ్లు వచ్చాయి. పూర్తి కంపెనీని కొనేందుకు ఆరు కంపెనీలు ముందుకు రాగా, ఆర్‌సీఎల్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలను వేర్వేరుగా కొనేందుకు మిగతా వారు బిడ్లు వేశారు. బిడ్డింగ్ గడువు ముగిసే నాటికి ఆర్ఎన్ఎల్ఐసీ కొనుగోలు కోసం ఒక్క బిడ్ కూడా రాలేదు. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్.. నిశ్చిత్ సమృద్ధి
ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. నిశ్చిత్ సమృద్ధి పేరుతో నాన్ లింక్డ్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. పన్ను రహిత, కచ్చితమైన రాబడులకు ఇందులో హామీ ఉంటుందని సంస్థ ప్రకటించింది. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, రిటైర్మెంట్ వరకు జీవితంలో వివిధ దశల్లో అవసరాలకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఇన్కమ్, ఎండోమెంట్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. తమ అవసరా లకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. అంటే రాబడులు, రక్షణ రెండింటి కలయికే ఈ బీమా ప్లాన్. పరిమిత కాలం పాటు అంటే ఏడాది, ఆరేళ్లు, ఏడేళ్లపాటే ప్రీమియం చెల్లించి.. ఎంపిక చేసుకున్నంత కాలం జీవితబీమా రక్షణ పొందొచ్చు. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీవోకి స్పందన
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్‌నామ్) ఐపీవోకి భారీ స్పందన లభించింది. ఐపీవో తొలి రోజున నిమిషం వ్యవధిలోనే ఇష్యూ 4.64 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. తద్వారా నిమిషం వ్యవధిలోనే పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తొలి ఐపీవోగా నిల్చిందని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 1,542 కోట్లు సమీకరిస్తోంది. మొత్తం 4.28 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా (యాంకర్ ఇన్వెస్టర్ల వాటా కాకుండా) మొత్తం 19.88 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చినట్లు ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం వెల్లడైంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ విభాగం 6.13 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లు 11.38 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 0.90 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. తొలి రోజున మొత్తం 2,61,694 దరఖాస్తులు వచ్చాయి. షేరు ఒక్కింటి ధరల శ్రేణి రూ. 247–252గా ఉన్న ఈ ఇష్యూ అక్టోబర్ 27తో ముగుస్తుంది. -
సాంప్రదాయ పాలసీలకు ప్రాధాన్యం
రెండంకెల స్థాయి వృద్ధిపై రిలయన్స్ నిప్పన్ దృష్టి... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాంప్రదాయ పాలసీల ఊతంతో రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం వసూళ్లకు సంబంధించి రెండంకెల స్థాయి వృద్ధిని ఆశిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలసీలను 32,000 నుంచి 60,000కి పెంచుకోవాలని భావిస్తోంది. కంపెనీ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) మనోరంజన్ సాహూ సోమవారమిక్కడ ఈ విషయాలు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.4,370 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా ఏజంట్ల సంఖ్యను 1,30,000 నుంచి 1,60,000కు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 5,000 మంది పైగా ఏజెంట్లను నియమించుకోనున్నామని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఏజంట్ల సంఖ్య 13,000కు చేరుతుందని సాహూ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ప్రీమియం వసూళ్లు దేశవ్యాప్తంగా రూ. 914 కోట్ల మేర ఉండగా.. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా సుమారు 9 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 18 పథకాలు విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. మరో మూడు పథకాలకు (ఒకటి యులిప్స్, రెండు సాంప్రదాయ ప్లాన్స్)కు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతుల కోసం వేచిచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ పాలసీలకే ఎక్కువగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, పోర్ట్‌ఫోలియోలో యులిప్స్ వాటాను క్రమంగా 15 శాతానికి తగ్గించుకోనున్నామని సాహూ చెప్పారు.