సాంప్రదాయ పాలసీలకు ప్రాధాన్యం
రెండంకెల స్థాయి వృద్ధిపై రిలయన్స్ నిప్పన్ దృష్టి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాంప్రదాయ పాలసీల ఊతంతో రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం వసూళ్లకు సంబంధించి రెండంకెల స్థాయి వృద్ధిని ఆశిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలసీలను 32,000 నుంచి 60,000కి పెంచుకోవాలని భావిస్తోంది. కంపెనీ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) మనోరంజన్ సాహూ సోమవారమిక్కడ ఈ విషయాలు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.4,370 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా ఏజంట్ల సంఖ్యను 1,30,000 నుంచి 1,60,000కు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 5,000 మంది పైగా ఏజెంట్లను నియమించుకోనున్నామని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఏజంట్ల సంఖ్య 13,000కు చేరుతుందని సాహూ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ప్రీమియం వసూళ్లు దేశవ్యాప్తంగా రూ. 914 కోట్ల మేర ఉండగా.. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా సుమారు 9 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 18 పథకాలు విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. మరో మూడు పథకాలకు (ఒకటి యులిప్స్, రెండు సాంప్రదాయ ప్లాన్స్)కు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతుల కోసం వేచిచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ పాలసీలకే ఎక్కువగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, పోర్ట్‌ఫోలియోలో యులిప్స్ వాటాను క్రమంగా 15 శాతానికి తగ్గించుకోనున్నామని సాహూ చెప్పారు.