ఈవీలపై రోడ్‌ట్యాక్స్ బాదుడు
కాలుష్యాన్ని నివారించేందుకు వీటిని ప్రోత్సహించిన వైఎస్ జగన్ ప్రభుత్వం జూలై 7 నాటికి ఓలా ఎస్1 (3 కేడబ్ల్యూహెచ్) ద్విచక్ర వాహనం విశాఖలో ఆన్‌రోడ్ ధర రూ.97,448 ఉండేది. అయితే, ఆ మర్నాడు జూలై 8 నుంచి దీని ధర అమాంతంగా రూ.1,08,579కు పెరిగింది. ఇందుకు కారణం.. జూలై 7 వరకు గత ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాల మీద ఇచ్చిన 12 శాతం రోడ్డు ట్యాక్స్ రాయితీని ఇప్పుడు టీడీపీ సర్కారు కొనసాగించకపోవడమే. ఇక ఎలక్ట్రికల్ కార్ల ధరలపై కూడా అదనంగా 12 శాతం రోడ్డు ట్యాక్స్ బాదనుండటంతో వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఆం«ధ్రప్రదేశ్లోనూ వీటి వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇంధన సంరక్షణ కోసం ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్, ఇతర పన్నుల మినహాయింపులు ఇస్తుండటంతో.. వాహన వినియోగం జోరందుకుంది. కానీ.. ఇప్పుడు ఏపీలో మాత్రం ఈ వాహనాలు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. కనిపించని భారాలను ప్రజలపై మోపి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈవీలను కూడా పావుగా వాడుకుంటూ రోడ్ ట్యాక్స్ బాదేస్తోంది. ఉన్న మాఫీనీ ఎత్తివేస్తున్న వైనం.. వాస్తవానికి.. పర్యావరణహిత రవాణాని ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై రహదారి పన్నుని పూర్తిగా మాఫీచేస్తూ.. రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉన్న మాఫీని వారం రోజుల క్రితమే ఎత్తేసింది. పెట్రోల్, డీజిల్ వాహనాలవల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడంతో పాటు హరిత వాహనాల కొనుగోలుని ప్రోత్సహించేందుకు దాదాపు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై రోడ్ ట్యాక్స్‌ని మినహాయింపునిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ నుంచి ఈవీలకు మినహాయింపుని కొనసాగిస్తూ వచి్చంది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం దీన్ని చెప్పాపెట్టకుండా ఎత్తేసి కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపింది. ఈనెల 7తో ముగిసిన కాలపరిమితి.. ప్రతియేటా.. రోడ్ ట్యాక్స్ మినహాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. గతేడాది ఇచి్చన జీఓ కాలపరిమితి ఈనెల 7తో ముగిసింది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ప్రతి ఈవీపై ఎలాంటి రోడ్ ట్యాక్స్ ఇప్పటివరకూ విధించలేదు. కానీ, ఆ జీఓ కాలపరిమితి ముగిసిపోవడంతో.. కొత్త ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి కొనసాగింపు ఉత్తర్వులు జారీ చెయ్యకుండా కాలయాపన చేస్తోంది. ఫలితంగా.. ఈవీ కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. 12 శాతం అదనపు భారం.. ఇక ఏపీలో కొనుగోలు చేసే ప్రతి ఎలక్ట్రిక్ వాహనానికి 12 శాతం రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజలపై కనిపించని భారాన్ని మోపుతూ అందినకాడికి దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. రోడ్ ట్యాక్స్ పేరుతో గుదిబండ మోపి.. ప్రజల డబ్బుతో ఖజానా నింపేసుకోవాలని కుయుక్తితో మినహాయింపు జీఓ జారీచేయలేదు. దీంతో.. రవాణాశాఖ 7వ తేదీ నుంచి కొనుగోలు చేసిన ప్రతి ఎలక్ట్రిక్ వాహనంపై రోడ్ ట్యాక్స్‌ని 12 శాతం విధిస్తోంది. ఫలితంగా ఎలక్ట్రికల్ టూ వీలర్స్‌పై రూ.12 వేల నుంచి కార్ల వినియోగదారులు వేరియంట్‌ను బట్టి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. రాయితీ కొనసాగింపుపై ఉత్తర్వుల్లేవు.. ఎలక్ట్రికల్ వాహనాలపై ఉన్న 12 శాతం రోడ్డు రాయితీ విధానం ఈనెల 7తో ముగిసిందని.. దీనిని కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేదని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయార్జన అవసరమున్న నేపథ్యంలో దీనిని కొనసాగిస్తుందన్న నమ్మకం కూడా తమకు లేదని వారు అభిప్రాయపడుతున్నారు.పన్ను రాయితీలు కొనసాగించండి.. మరోవైపు.. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లపై పన్ను రాయితీని కొనసాగించాలని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కోరుతూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి బుధవారం వినతిపత్రాన్ని సమరి్పంచింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ విధానాన్ని అనుసరిస్తూ గత ప్రభుత్వం ఈవీ వాహనాల తయారీ, అమ్మకం, కొనుగోలుపై పన్ను రాయితీలను ఈ ఏడాది జులై 7 వరకు కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ విధానాన్ని ఖరారు చేయనందున ఆ పన్ను రాయితీలను పొడిగించాలని కోరింది. రిజి్రస్టేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్, ఇతర పన్ను రాయితీలను కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది.