‘అమ్మ’ చెప్పిన కన్నీటి కథ
► ఉన్నతుడిగా చూడాలనుకున్నా.. శవమై వస్తాడనుకోలేదు
► ఇలాంటి చదువులొద్దు.. నా రెండో బిడ్డను ఇక చదివించను
► పెద్ద హోదాలో చూసేందుకు.. కూలి చేసి నా బిడ్డలను చదివించుకుంటున్నా
► పేదరికం నుండి బయటకు రావాలని.. కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు
► పుస్తకాలు కొనలేక లైబ్రరీకి వెళ్లి చదివేవాడు.. చిన్నప్పటి నుండే అన్నింటా ఫస్ట్
► నా కొడుకుకు నేనంటే ఎంతో ప్రేమ.. ఆదివారం ఇంటికి వస్తానన్నాడు
► సస్పెండ్ చేసినట్లు మాకు సమాచారమిచ్చినా బతికించుకునేవాళ్లం
► యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్య గొడవలు లేకుండా చూడండి
► వీసీని సస్పెండ్ చేసి, మిగతా నలుగురు విద్యార్థులకు న్యాయం చేయాలి మీ పక్షాన మేమున్నాం, న్యాయం కోసం పోరాడుదామని జగన్ భరోసా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తార్నాక నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి.. ఉప్పల్ చౌరస్తాకు దగ్గర్లో ఇందిరాగాంధీ విగ్రహం పక్క నుంచి అర కిలోమీటర్ లోపలికి వెళితే బ్యాంకు కాలనీ వస్తుంది. మధ్యతరగతి వర్గాలు నివసించే ఆ కాలనీకి మరోవైపున సాధారణ ప్రజల కాలనీ ఉంటుంది. హెచ్‌సీయూలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబం ఆ కాలనీలో ఓ మూలన ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో నివసిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలు, ధర్నాల్లో పాల్గొని అలసిపోయి నీరసంతో ఇంటికి చేరుకున్న రోహిత్ తల్లి రాధిక... ఆ ఇంటి గుమ్మంలో కనిపించిన వైఎస్ జగన్‌ను చూసి ఒక్కసారిగా బావురుమన్నది.
ఉదయం నుంచి బిగపట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘‘అన్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఉన్నతులుగా ఎదుగుతున్న పిల్లలకు దగ్గరగా ఉండాలని ఇరవై రోజుల క్రితమే ఇక్కడికి వచ్చా.. పెద్ద హోదాలో చూడాలనుకున్న నా కొడుకు శవమై వచ్చాడు. ఇలాంటి చదువులొద్దు.. నా రెండో బిడ్డ రాజాను ఇక చదివించను..’’.. అంటూ రాధిక గుండెలవిసేలా రోదించింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ అమ్మ చెప్పిన కన్నీటి కథ విన్న వైఎస్ జగన్ చలించిపోయారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్యాంక్ కాలనీలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్ అద్దెకు ఉంటున్న నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. ‘మీపక్షాన మేమున్నాం.. న్యాయం కోసం పోరాడదాం..’ అని వారికి భరోసానిచ్చి కన్నీళ్లను తుడిచారు. దాదాపు 35 నిమిషాలపాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్... రోహిత్ కుటుంబ పరిస్థితిని, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
వైఎస్ జగన్ ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టగానే రాధిక తన కుమారుడిని గుర్తుచేసుకుంటూ బోరున విలపించారు. ‘నాలాంటి దురదృష్టవంతురాలు మరే తల్లి కావద్దు. గుంటూరు సమీపంలోని పల్లెటూరులో రోజు కూలీగా టైలరింగ్ చేస్తూ వచ్చే రూ. 150తో నా బిడ్డని చదివించుకుంటున్నా.. వాడి ని పెద్ద హోదాలో చూసేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు. పీహెచ్డీ చేసి పెద్దవాడై.. మమ్మల్ని పేదరికం నుండి బయటపడేస్తాడనుకున్నా.. కానీ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు..’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
సస్పెండ్ చేసినట్లు తెలిసినా బతికించుకునేవాళ్లం..
తన కుమారుడికి తానంటే ఎంతో ప్రేమ అని... అందుకే అందరం ఒకేచోట ఉండేందుకు 20 రోజుల క్రితమే తాను హైదరాబాద్ వచ్చి చిన్న కుమారుడు రాజా గదిలో ఉంటున్నానని రాధిక చెప్పారు. రాజా ఎన్జీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగని, ఎన్జీఆర్ఐకి దగ్గరగా ఉండేందుకు బ్యాంక్ కాలనీలో ఉంటున్నామన్నారు. భోగి ముందు రోజు ఫోన్ చేసిన రోహిత్.. ఆదివారం తమ వద్దకు వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని విలపించారు. తన కుమారుడిని సస్పెండ్ చేసినట్లు కనీసం తనకు సమాచారమిచ్చినా తమతో తీసుకువెళ్లేవారమని... అప్పుడు తన కొడుకు తనకు దక్కేవాడని చెప్పారు. ‘‘వాడు చిన్నప్పటి నుండే మెరిట్ స్టూడెంట్.
అన్నింటా ఫస్ట్. ఉన్నత చదువు ఇంత ఘోరంగా ఉందని తెలిస్తే.. చదువు మాన్పించేదాన్ని. ఇతరుల పిల్లలకు నాలాగా అన్యాయం జరగొద్దు. యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవల్లేకుండా మీరైనా చొరవ తీసుకోండి. మా చిన్నోడికి దారి చూపండి...’’ అంటూ రాధిక వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. వర్సిటీలో ఇంత ఘోరం జరగడానికి చేతకాని వీసీయే కారణమని... వెంటనే వీసీని సస్పెండ్ చేసి, బహిష్కరణకు గురైన మిగతా నలుగురు విద్యార్థులకు న్యాయం చేయాలన్నదే మా విన్నపమని పేర్కొన్నారు. దీంతో ‘‘మీరేం అధైర్య పడొద్దు. మీ పక్షాన మేమున్నాం. న్యాయం కోసం పోరాడుదాం..’’ అని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైఎస్సార్సీపీ నాయకులు ఉప్పులేటి కల్పన, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, హనుమారెడ్డి, వి.కొండారెడ్డి తదితరులు ఉన్నారు.
మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..: వైఎస్ జగన్
‘‘మొన్ననే గుంటూరులో రిషితేశ్వరి ఘటన చూశాం. అది కూడా ఇంచుమించు ఇటువంటిదే. ఆ తల్లి చనిపోయింది. అక్కడి ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్య కూడా తీసుకొలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చూశాం. ఇవాళ కూడా వేముల రోహిత్ ఘటన విషయంలో రకరకాల వాదనలు వినబడుతున్నాయి. వీసీ తప్పిదం బలంగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. పిల్లలకు అండగా నిలవాల్సిన వీసీలే మద్దతివ్వకుండా... పిల్లలు చనిపోయేంత దూరం, వాళ్ల మానసిక స్థితిగతులను ప్రేరేపిస్తా ఉంటే నిజంగా బాధగా ఉంది. ఇప్పటికైనా కూడా ఒకటే రెక్వెస్ట్ చేస్తున్నా... రాజకీయాలను పక్కనపెట్టండి. హెచ్‌సీయూలో ఐదుగురిని సస్పెండ్ చేశారు. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంకా నలుగురు సస్పెన్షన్ ఎత్తేయండని అక్కడే టెంట్ వేసుకొని నిరాహరదీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్లకు నిజంగా రూ. 30 వేలు స్టైఫండ్ వస్తేనే బతికే పరిస్థితి. యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమ్మంటూ సస్పెండ్ చేస్తే ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. చదువులు ఆగిపోతాయి. క్యాంపస్ క్యాంటీన్‌కు వెళితే రాయితీ మీద ఫుడ్ ఉంటుంది. కానీ అక్కడికి కూడా వెళ్లొద్దంటున్నారు. లైబ్రరీకి వెళ్లొద్దంటున్నారు. బుక్స్ కూడా కొనుక్కుని చదువుకునే పరిస్థితి లేదు.
ఇటువంటి దీన పరిస్థితుల్లో పిల్లలు మా సస్పెన్షన్ ఎత్తేయండి అని అభ్యర్థిస్తా ఉన్నారు. మానవతా దృక్పథంతో కనీసం ఇప్పటికైనా కూడా వీసీ ముందుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఆ పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం, వారికి మనోధైర్యం నింపే కార్యక్రమం చేస్తేనే పిల్లలు కనీసం మళ్లీ కాలేజీ, యూనివర్సిటీకి వెళ్లే పరిస్థితి వస్తుంది. నేను కూడా కచ్చితంగా రేపు యూనివర్సిటీకి వెళ్లి నిరాహరదీక్ష చేస్తున్న ఆ నలుగురు పిల్లలను కలసి సంఘీభావం తెలుపుతా. వీసీకీ మరోసారి రెక్వెస్ట్ చేస్తున్నా.. మానవతా దృక్పథంతో ఆలోచించి సస్పెన్షన్ ఎత్తివేసి, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నా..’’