ఈవీఎంల చోరీ కేసులో నిందితుడికి పదవి
ఆర్టీజీసీ సాంకేతిక సలహాదారుగా హరికృష్ణ ప్రసాద్
హరికృష్ణ ప్రసాద్ నియామకంపై విస్తుపోతున్న అధికారులు
సాక్షి, అమరావతి: రియల్ టైమ్ గుడ్ గవర్ననెన్స్ కమిటీ(ఆర్టీజీసీ) సాంకేతిక సలహాదారుగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల చోరీ కేసులో నిందితుడైన హరికృష్ణ ప్రసాద్‌ను ఆర్టీజీసీ సాంకేతిక సలహాదారుగా నియమించడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి.
హరికృష్ణ ప్రసాద్‌పై ముంబైలో కేసు నమోదు
సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన హరికృష్ణ ప్రసాద్ ఈవీఎంలను ట్యాంపర్ చేయటంపై 2010 ఏప్రిల్ 29 ఓ టీవీ ఛానల్లో లైవ్ షో ఇచ్చారు. ఇందులో ప్రదర్శించిన ఈవీఎంను మహారాష్ట్ర ఎన్నికల్లో వినియోగించారు. ఈ నేపథ్యంలో ఈవీఎంను అపహరించారంటూ ముంబై ఎన్నికల అధికారి 2010 మే 12న ఫిర్యాదు చేయటంతో పోలీసులు హరికృష్ణ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. దేశ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేలా హరికృష్ణ ప్రసాద్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈఎంవీ చోరీ చేసులో నిందితుడైన ఆయన్ను ఏరి కోరి ఆర్టీజీఎస్ సలహాదారుగా నియమించడంపై అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. హరికృష్ణ ప్రసాద్ సోదరుడైన డాక్టర్ వేమూరి రవికుమార్ ప్రసాద్‌ను ప్రవాస తెలుగు ప్రజల వ్యవహారాల విభాగం సలహాదారుగా నియమించారు. వీరికి సంబంధించిన సంస్థకే ఫైబర్ గ్రిడ్, ఈ–ప్రగతి ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధిచేకూర్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.