అనుమానంతో అఘాయిత్యం
ఉప్పల్, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది... కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను పెరోల్‌పై బయటకు వచ్చి భార్యను అతికిరాతకంగా పొడిచి చంపి పారిపోయాడు. రామంతాపూర్ గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఎస్. వీరు (36) చార్మినార్‌లో ట్రైలరింగ్ పని చేసేవాడు.
12 ఏళ్ల క్రితం అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే సంగీతను ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈకేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు.. తనపై కేసులు ఎత్తేశారని నమ్మబలికి రామంతాపూర్ గాంధీనగర్‌కు చెందిన బసంతి కూతురు నందిని(30)ను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ధనుష్ (8) సంతానం. అనంతరం ప్రియరాలి హత్య కేసులో వీరుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్త జైలుకు వెళ్లినప్పటి నుంచి నందిని అమ్మగారి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ.. దుస్తుల షాపులో పని చేస్తూ జీవిస్తోంది.
ఏడేళ్ల తర్వాత ఈనెల 3న పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన వీరు భార్య వద్దే ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన రోజు నుంచి అనుమానంతో ఆమెతో గొడవ పడుతున్నాడు. కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి.. తన కొడుకును తీసుకుపోతానని పలుమార్లు గొడవపడ్డాడు. ఇదిలా ఉండగా, సోమవారం మధ్యాహ్నం నందిని భోజనం చేస్తుండగా ఇంటికి వచ్చిన వీరు ఆమెతో గొడవకు దిగాడు. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న వీరు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపు, ఛాతి, కాళ్లపై విచక్షణారహితంగా పొడిచాడు.
అదే సమయంలో ఇంటికి చేరుకున్న కుమారుడు తల్లిపై దాడిని అడ్డుకోబోగా అతడిని కూడా కత్తితో గాయపర్చి పారిపోయాడు. వెంటనే ధనుష్ పక్కనే ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఆమెను తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న నందినిని రామంతాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందని హత్యతో గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.