డైలాగు చెబుతూ.. కుప్పకూలిన నటుడు
నాటకాన్నే శ్వాసిస్తూ.. నాటకం ఆడుతూనే ప్రాణాలు కోల్పోయాడో మరాఠీ కళాకారుడు. సాగర్ శాంతారామ్ చౌగ్లే (38) అనే ఈ కళాకారుడు.. పుణెలో స్టేజి మీద నాటకంలో డైలాగు చెబుతూ ఉండగానే కుప్పకూలిపోయాడు. అతడిని తోటి కళాకారులు, ప్రేక్షకులు కలిసి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికపే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాగర్‌కు పెళ్లయ్యి, ఒక కుమార్తె కూడా ఉంది. అతడి మృతదేహాన్ని స్వస్థలమైన కొల్హాపూర్‌కు తరలిస్తున్నారు.
పుణెలో నాటక కళాకారులు స్టేజిమీద ప్రదర్శన ఇస్తూ మరణించడం ఇది రెండోసారి. ప్రముఖ మరాఠీ నటి, నృత్య కళాకారిణి అశ్వినీ ఏక్బోతే కూడా గత సంవత్సరం అక్టోబర్‌లో పుణెలోని భారత నాట్యమందిర్ వేదిక మీద ప్రదర్శన ఇస్తూ మరణించారు. నాటకాల పోటీలో పాల్గొనేందుకు సాగర్, అతడి బృందం పుణెకు వచ్చారు. వాళ్లు 'అగ్నిదివ్య' అనే నాటకం ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ సంఘసంస్కర్త సాహు మహరాజ్ జీవిత కథ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అందులో సాగర్ సాహు మహరాజ్ పాత్రను పోషిస్తున్నాడు. సాగర్ తండ్రి కూడా గతంలో మరాఠీ నాటకాలు, సినిమాలలో నటించారు.