పద్నాలుగేళ్ల పసిపాప!
అంతుచిక్కని వ్యాధితో నిలిచిపోయిన ఎదుగుదల
మంచానికే పరిమితం తల్లడిల్లుతున్న మాతృమూర్తి
అందని పింఛను, ప్రభుత్వ సాయం
గాంధీనగర్ : విధి ఆ కుటుంబంపై చిన్నచూపు చూసింది. భర్త గుండెపోటుతో మరణించాడు. చిన్న కూతురు సుమనాగవల్లి అంతుచిక్కని వ్యాధితో పద్నాలుగేళ్లుగా మంచానికే పరిమితమైంది. శారీరక, మానసిక ఎదుగుదల లేదు. బాధ కలిగితే ఏడవడం తప్ప అమ్మా అని పిలవలేని పరిస్థితి. ఎవరన్నా పలకరిస్తే కన్నెత్తి చూడలేదు.
ఆస్తులు కోల్పోయి, భర్తను పోగొట్టుకుని కూతురి దీనస్థితి చూసి తల్లడిల్లుతున్న ఓ మాతృమూర్తి మనోవేదన ఇది. వాంబేకాలనీకి చెందిన పోలేపల్లి విజయ్‌కుమార్, రమాదేవిలకు ఇద్దరు ఆడపిల్లలు. అమృతవల్లి, సుమనాగవల్లి. చిన్నప్పుడే సుమనాగవల్లి ఊయలలోంచి జారిపడింది. వైద్యులకు చూపించారు. ఏమీ కాలేదన్నారు. ఆ తర్వాత మూడు నెలలకు పాపకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఫిట్స్.. అలా కోమాలోకి వెళ్లింది. అంతే ఆ కుటుంబంలో సంతోషం ఆవిరైపోయింది. పిల్లల వైద్యులందరికీ చూపినా ఫలితం దక్కలేదు.
ఆస్తులన్నీ విక్రయం
ఈ క్రమంలో ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. నిలువ నీడనిచ్చే ఇంటిని అమ్ముకున్నారు. నాగవల్లికి ద్రవాహారం ఇస్తూ కంటికి రెప్పలా కాపడుకుంటూ వస్తున్నారు. ఇంతలో రమాదేవి భర్త గుండెపోటుతో మరణించాడు. ఇక కష్టాలు ప్రారంభమయ్యాయి. పెద్ద కూతుర్ని మున్సిపల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేర్పించారు. రమాదేవి ఇంటి వద్దే చాక్లెట్లు, బిస్కెట్లు విక్రయిస్తూ వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు.
నాగవల్లికి మందులు, ఇంటి అద్దెలు...ఇలా ఒక్కొక్కటి భారమైపోతున్నాయి. చెన్నైలో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు సూచించారు. డబ్బులు సమకూర్చుకునేందుకు బయటకు వెళ్లాలంటే కూతురి సంరక్షణ కష్టమవుతుంది. అందుకే ఆమె ఇంట్లోనే ఉండాల్సివచ్చింది.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
ప్రభుత్వం సాయం చేయలేదు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం అందిస్తే చెన్నై వెళ్లి వైద్యం చేయించుకుంటానని రమాదేవి కన్నీరు పెట్టుకుంటున్నారు.
పింఛను రావడంలేదు
వితంతు పింఛను మంజూరు కాలేదు. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఆధార్‌కార్డు లేదని, రేషన్ కార్డులేదని కొర్రీలు వేస్తున్నారు. నా కూతురికి 90 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉన్నా వికలాంగుల పింఛను రావడంలేదు. కనీసం అదన్నా ఇస్తే బిడ్డకు అవసరమైన ఆహారం సమకూర్చుకుంటా.
-రమాదేవి