samira nelapudi
-
పవిత్ర దృక్పథం
ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసింది. అలాంటి ఆమె ఎలా ఆలోచించాలి? మంచి చిత్రాలు తీయాలి, పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, పెద్ద సెలెబ్రిటీ అవ్వాలి అనే కదా! పవిత్రాచలం కూడా మొదట అలానే అనుకుంది. కానీ ఓ ఊహించని సంఘటన ఆమె ఆలోచనలను వేరే దిశగా మళ్లించింది. ఓ వ్యక్తి అన్న ఒక్క మాట... ఆమెకో కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. ఏమిటా గమ్యం? పవిత్రాచలం తీసిన డాక్యుమెంటరీలు చూస్తే... ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది! ‘‘సినిమా చూస్తే మనసు భారమైపోకూడదు. ఒత్తిళ్లను మర్చిపోవ డానికి సినిమాకెళ్తాం. అక్కడికెళ్లాక సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అక్కడికెళ్లి కూడా బాధపడితే ఇక సినిమాకి వెళ్లడం ఎందుకు? ఇలా అనుకునేవాళ్లెవరూ సందేశాత్మక చిత్రాలు చూడరు. ఇక డాక్యుమెంటరీలేం చూస్తారు, నావయితే అస్సలు చూడరు’’ అంటుంది పవిత్ర. అది నిజమే. ఆమె తీసే డాక్యుమెంటరీలు చూడాలంటే ప్రత్యేకమైన నేత్రం కావాలి. ఎదుటివాడి కష్టాన్ని చూసి కదిలిపోయే సున్నితమైన మనసు ఉండాలి. వాస్తవాలను తెలుసుకుని తట్టుకోగల స్థైర్యం ఉండాలి. అలాంటివాళ్లు మాత్రమే పవిత్ర చిత్రాలను చూడగలరు. పోతపోసిన ప్రతిభ... పవిత్రాచలం బెంగళూరులో జన్మించింది. ఆమెకు మొదట్నుంచీ చాలా ఆసక్తులున్నాయి. ప్రతిభాపాటవాలూ ఉన్నాయి. మొదట మౌంట్ కార్మెల్ కాలేజీలో బీఏ చేసింది. మంచి క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ చాంపియన్‌గా ఎదిగింది. జర్నలిజంలో డిప్లొమో చేసింది. న్యూయార్క యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేసింది. ఆ పైన ఓ జాతీయ చానెల్లో చేరింది. అప్పటివరకూ జరిగిందంతా ఒకెత్తు. 2003లో పాకిస్థాన్‌లో జరిగిన యువ శాంతి సదస్సులో పాల్గొనడానికి వెళ్లడం మరో ఎత్తు. ఆ పర్యటన... పవిత్రని, ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. శాంతి గురించి, సమాజ శ్రేయస్సు గురించి అక్కడ యువతీ యువకులు చేసిన ప్రసంగాలు పవిత్రలో స్ఫూర్తిని నింపాయి. అప్పుడే తొలిసారిగా ఆమెలోని ఫిల్మ్‌మేకర్ మేల్కొంది. ఇరుదేశాల యువత మనోభావాలూ ప్రతిఫలించేలా ‘బస్’ అనే డాక్యుమెంటరీని తీసింది. తరువాత ఆమె వరుసగా తీస్తూనే ఉంది. కానీ అనుకోకుండా ఎదురైన ఓ అనుభవం... ఆమెను ఓ స్ఫూర్తిదాయక ఫిల్మ్‌మేకర్‌ను చేసింది. 2007లో క్యాన్సర్ మీద అవగాహన కలిగించే డాక్యుమెంటరీ తీయడానికి ఆయేషా అనే యువతి దగ్గరకు వెళ్లింది పవిత్ర. ఆయేషా వయసు 26. క్యాన్సర్ ముదిరిపోయింది. మనిషి శుష్కించిపోయింది. ఇప్పుడో రేపో అన్నట్టుంది. వీడియో తీయడానికి సహకరించే ఓపిక కూడా లేదామెలో. దాంతో నీకు ఓపిక ఉన్నప్పుడు చేద్దాంలే అని చెప్పి వచ్చేసింది పవిత్ర. తర్వాత రోజు ఆయేషా నుంచి ఫోన్ వచ్చింది. ‘రండి తీసేద్దాం’ అని ఆమె అనడంతో వెంటనే వెళ్లింది. ఆయేషాని పవిత్ర అడిగింది... ఇంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని! ‘‘నేనెప్పుడు పోతానో నాకే తెలీదు, నేను పోయాక నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలు కదా’’ అంది ఆయేషా. ఆ మాట పవిత్ర మనసులోకి చొచ్చుకుని పోయింది. చనిపోతూ కూడా ఎదుటి వారికి ఉపయోగపడాలన్న ఆయేషా ఆలోచన... పవిత్రకు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసింది. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది... ఇక మీదట సమాజానికి ఉపయోగపడే చిత్రాలు మాత్రమే తీయాలని! ‘కర్లీ స్ట్రీట్ మీడియా’ అనే సంస్థను స్థాపించి, సామాజిక సమస్యల్ని చిత్రాలుగా తీయడం మొదలుపెట్టింది. ట్రాఫికింగ్ గురించి ‘బౌండ్ బై అజ్’, దేవదాసీల గురించి ‘అనామిక’, మాదక ద్రవ్యాలకు బానిసైన వారి కోసం ‘మై ఫ్రెండ్ ద అడిక్ట్’, మానసిక వికలాంగ చిన్నారుల కోసం ‘ఖుష్బూ’, డౌన్ సిండ్రోమ్ బాధితుల గురించి ‘ఇన్ డెలిబుల్’... ఆమె తీసిన ప్రతి చిత్రమూ కదిలించింది. సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఉన్నట్టుండి ఈ సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చేయలేరు. అందుకే... కనీసం సమస్యల విషయంలో అప్రమత్తం చేస్తోంది. వాటి పరిష్కారాల గురించి ఆలోచనలు రేకెత్తిస్తోంది. అందుకు పవిత్రని అభినందించి తీరాల్సిందే! - సమీర నేలపూడి పవిత్ర తీసిన డాక్యుమెంటరీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘రూట్ ఫర్ రూనా’ గురించి. ఓ రోజు ఓ ఆంగ్ల పత్రికలో రూనా అనే రెండేళ్ల అమ్మాయి గురించి కథనం వెలువడింది. త్రిపురకు చెందిన ఆ పాప హైడ్రోసెఫలస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ మెదడు సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లకు తల అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. రూనాకి కూడా అలానే పెరిగిపోయింది. ఆమె ఫొటోని పత్రికలో చూడగానే పవిత్ర కదిలి పోయింది. ఆ వ్యాధి గురించి తన టీమ్‌తో కలిసి రీసెర్చ చేసింది. మన దేశంలో రూనాలాగా ఆ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారులు చాలమంది ఉన్నారని తెలుసుకుంది. వెంటనే ‘రూటింగ్ ఫర్ రూనా’ అనే డాక్యుమెంట రీని తీసింది. రూనా చికిత్సకి నిధులు సమకూరడంలో ఈ డాక్యుమెంటరీ పెద్ద పాత్రే పోషించింది. రూనాకి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. మెల్లగా కోలు కుంటోంది. అయితే రూనా లాంటి వారందరినీ కూడా వ్యాధి నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తున్నారు పవిత్ర టీమ్. ఆ వ్యాధిపట్ల అందరికీ అవగాహన కల్పించడంతోపాటు నిధులనూ సేకరిస్తున్నారు. ************** పవిత్రతో పాటు అడుగులు వేస్తున్నవాళ్లు కొందరున్నారు. అశ్విన్, అక్షయ్ శంకర్, అనన్య రాయ్, రిషి తుషు, జ్యోత్స్న బాలకృష్ణన్, తేజేష్ కిరణ్, అనితా తుషు... వీళ్లంతా పవిత్రలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న తపన ఉన్నవాళ్లు. అందుకే ఆమెతో చేతులు కలిపారు. ఆమెతో కలిసి అడుగులు వేస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేయడం, వాటిని ఎలా చూపించాలి, దాని ద్వారా ఏ సందేశం ఇవ్వాలి అన్న విషయాలను అందరూ కలిసి చర్చించుకుంటారు. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా సాగిపోతారు. -
జీవితపు ప్రతి మలుపూ...ఓ గెలుపు పిలుపు
అభాగినుల పాలిట అమ్మ జీవితంలో సుఖదుఃఖాలు సహజం. కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా ఎదిరించి, ముందుకు పోవడమే మనిషి చేయాల్సింది. అలా చేసినప్పుడే విజేతలుగా నిలుస్తాం. జీవితాన్ని గెలుస్తాం. కానీ, గెలుపంటే... కేవలం మనం గెలవడమే కాదు... మన తోటివారినీ గెలిపించడం! పడిపోతున్న సాటి మనిషికి చేయిచ్చి, నిలబెట్టడం! మన జీవనం మరెందరికో ప్రేరణ కలిగించడం! వ్యక్తిగత విషాదాన్ని కూడా వ్యవస్థకు స్ఫూర్తినిచ్చే మార్గానికి మళ్ళించుకున్నవాళ్ళే అసలైన విజేతలు... సమాజానికి స్ఫూర్తిదాతలు. అత్యాచార బాధితులకు అమ్మగా మారిన అనూరాధ, జీవిత విషాదాన్ని కడుపులో దాచుకొని తొమ్మిది పదులు దాటినా పరుగు ఆపని ఫౌజా సింగ్, క్యాన్సర్‌ను ఓడించి పర్వతారోహణతో తోటివారిని గెలిపిస్తున్న షాన్... వీరంతా మన మధ్యనే ఉన్న మామూలు మనుషులే అయినా జీవిత పోరాటంలోని ప్రతి మలుపునూ గెలుపు పిలుపుగా మార్చుకున్న ఆదర్శవంతులు. జీవితాన్ని గెలిచిన వీరి ప్రస్థానం అవిస్మరణీయ స్ఫూర్తి మంత్రం. నేపాల్ రాజధాని ఖాట్మండు. పోలీసు వ్యాన్ వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. లోపల ఏదో పనిలో ఉన్న అనూరాధా కొయిరాలా లేచి బయటికొచ్చింది. వ్యాన్‌లో నుంచి పోలీసులతో పాటు ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి కూడా దిగింది. ఆమె ముఖం వాడిపోయి ఉంది. కళ్లు నీటి చలమల్లా ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు గీత. తండ్రి లేడు. అంధురాలైన తల్లికి ఆసరాగా ఉండటం కోసం, తమ ఇద్దరి కడుపులూ నిండడం కోసం కూలీ పని చేసేది. ఓ రోజు ఓ బంధువు గీతకు మంచి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వేశ్యా గృహంలో అమ్మేశాడు. అప్పటికామె వయసు తొమ్మిదేళ్లు. ఆడుతూపాడుతూ గడవాల్సిన గీత బాల్యం... విటుల వికృత చేష్టలతో విషాదభరితమైంది. మూడేళ్లు నరకం చూసింది. ఓ రోజు పోలీసులు వేశ్యా గృహంపై దాడి చేసి, సోదాలు నిర్వహించినప్పుడు ఆమె దొరికింది. వాళ్లు ఆమెను అనూరాధ దగ్గరకు తీసుకెళ్లారు. గీతను లోపలకు తీసుకెళ్లింది అనూరాధ. అంతే... అంతవరకూ గుంభనంగా ఉన్న గీత వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అనూరాధ. ‘నేనున్నాను’ అని భరోసా ఇస్తున్నట్టుగా వెన్ను నిమిరింది. ఆ ఆప్యాయతకు చలించిపోయింది గీత. అనూరాధలో అమ్మను చూసుకుంది. కానీ ఆమెకు తెలియదు... అప్పటికే తన లాంటి చాలామంది కూతుళ్లు అనూరాధకు ఉన్నారని! అది అభాగ్యులకు పుట్టిల్లు... మనిషికి కూడు, గూడు, గుడ్డ ముఖ్యావసరాలని అంటారు. కానీ ఆడపిల్లకు వీటితో పాటు మరో ముఖ్యావసరం ఉంది... ‘రక్షణ’. అమ్మాయిలకు ప్రమాదం ఎప్పుడూ పురుషుడి రూపంలో పొంచే ఉంటుంది అంటుంది అనూరాధ. భర్త, బంధువు, పక్కింటివాడు, వీధి చివర ఉండే పోకిరిగాడు, బడిలో పాఠాలు చెప్పే మాస్టారు, సహ విద్యార్థి, కిరాణా కొట్టువాడు, పాలవాడు... ఎవరి వల్ల ఎప్పుడు తమ మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందోనని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. ఇది అనూరాధకు నచ్చలేదు. అందుకే ఆడపిల్లల రక్షణే లక్ష్యంగా ఇరవయ్యేళ్లుగా తన జీవన ప్రస్థానాన్ని సాగిస్తోంది. 1993లో మైతీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది అనూరాధ. మైతీ అంటే పుట్టిల్లు అని అర్థం. కష్టం వస్తే ఆడపిల్లలు పుట్టింటికెళ్లి తల దాచుకుంటారు. అందుకే తన ఇంటిని పుట్టింటిని చేసిందామె. అమ్మలా కొండంత అండ అయింది. నాన్నలా ధైర్యాన్నిచ్చింది. అన్నలా కాపాడింది. దీనంతటి వెనుక... కదిలించే కథ ఉంది. అనూరాధ తల్లితండ్రులైన ప్రతాప్‌సింగ్, లక్ష్మి దంపతులు ఎదుటివారికి తోడ్పడటంలో ముందుండేవారు. వారి మంచితనాన్ని పుణికి పుచ్చుకుంది అనూరాధ. ఎవరు కష్టంలో ఉన్నా పరిగెత్తుకు వెళ్లేది. కానీ తన జీవితమే కష్టాలపాలవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. దినేష్ ప్రసాద్ కొయిరాలాతో పెళ్లి ఆమె జీవితాన్నే మార్చేసింది. భర్త క్రూరుడు. అష్టకష్టాలు పెట్టాడు. అనుమానించాడు. అవమానించాడు. ఎన్నో యేళ్లపాటు సహించింది. చివరికి ఓపిక నశించింది. హింసించడం ఎంత తప్పో, హింసకు తలవంచ డం కూడా అంతే తప్పన్న నిజాన్ని గ్రహించి, భర్త నుంచి విడిపోయింది. నాటితో హింస నుండి విముక్తి లభించింది. కానీ ఎందుకో మనశ్శాంతి లేదు. తానంటే చదువుకుంది. ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తోంది. ధైర్యంతో హింసను ఎదిరించింది. కానీ ఆ అవకాశం లేనివాళ్లంతా మౌనంగా భరిస్తున్నారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ‘మైతీ నేపాల్’ను స్థాపించింది. ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టంలో ఉందని తెలిసినా అక్కడికి వెళ్లిపోతుంది. కాపాడి తీసుకొస్తుంది. గృహహింసకు గురవుతున్నవారినీ, అత్యాచార బాధితులనూ ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది. ఆసక్తి ఉంటే చదివిస్తుంది. లేదంటే చేతివృత్తులు నేర్పించి తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తుంది. అలా ఇప్పటికి కొన్నివేల మంది జీవితాలను తీర్చిదిద్దింది. ఇప్పటికీ ఆమె గూటికి వందల మంది నిస్సహాయ వనితలు వస్తూనే ఉన్నారు. వాళ్లు ఎవరైనా ఆమె పిల్లలే. ఆమె ప్రేమకు అర్హులే. అందుకే వాళ్లంతా అనూరాధను అమ్మ అంటారు. ఆమె గుండెల్లో తల దాచుకుంటారు. ఆమె చూపే బాటలో సాగి బతుకులు బాగు చేసుకుంటారు. వాళ్లందరినీ చూస్తే ఒకటే అనిపిస్తుంది. అనూరాధ ఉన్నంతవరకూ ఏ ఆడపిల్లా ఒంటరిది కాదు. నిస్సహాయురాలూ కాదు, ఆమె కానివ్వదు! - సమీర నేలపూడి సేవానిరతికి గాను దాదాపు ముప్ఫై జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అనూరాధను వరించాయి. హాలీవుడ్ నటి డెమీ మూర్ అనూరాధ సేవకు ముగ్ధురాలై, ఆమెతో చేతులు కలిపింది. ‘మైతీ నేపాల్’కు తన వంతు సహాయాన్ని అందిస్తోంది. పలు దేశాల్లోని ప్రముఖ సంస్థలు విరాళాలివ్వడానికి ముందుకొచ్చాయి. అనూరాధ వల్ల నేపాల్‌లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు చాలావరకూ తగ్గిపోయాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించడం ఆమె సాధించిన గొప్ప విజయం!